India vs South Africa 2nd ODI: రెండు టెస్టుల సిరీస్ ను సౌత్ ఆఫ్రికా వైట్ వాష్ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీమిండియాను.. వారి సొంత గడ్డమీద దారుణంగా ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత.. వన్డే సిరీస్ లో కూడా దక్షిణాఫ్రికా అదే జోరు కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
రాంచి వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా బౌలర్లు దారుణంగా తేలిపోయారు. రెండు టెస్ట్ లలో వికెట్ల మీద వికెట్లు తీసిన ఆ బౌలర్లు.. తొలి వన్డే మ్యాచ్లో పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. యాన్సన్ నుంచి మొదలుపెడితే బర్గర్ వరకు ఇదే ధోరణి కొనసాగించారు. మరోవైపు టెస్ట్ సిరీస్ లో బ్యాటింగ్లో అదరగొట్టిన రికెల్టన్, మార్క్రం వంటి వారు ఆకట్టుకోలేకపోయారు. వర్క్ లోడ్ నేపథ్యంలో బవుమా కు మేనేజ్మెంట్ తొలి వన్డేలో రెస్ట్ ఇచ్చింది. ఆ ప్రభావం దక్షిణాఫ్రికా జట్టు మీద తీవ్రంగానే కనిపించింది.
తొలి వన్డేలో ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. మిడిల్ ఆర్డర్ నుంచి మొదలు పెడితే లోయర్ ఆర్డర్ వరకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాన్సన్, జోర్జి, బ్రిట్జ్కీ, జోష్, బ్రెవిస్ వంటి వారు దుమ్మురేపారు. అయితే వారి దూకుడు టీమ్ ఇండియాకు ఓటమిని మాత్రం మిగల్చలేకపోయింది.. ఈ నేపథ్యంలో తొలి ఓటమి అందించిన గుణపాఠం దక్షిణాఫ్రికా జట్టు మీద భారీగానే ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే రెండో వన్డేలో మేనేజ్మెంట్ రెండు మార్పులు చేయనుంది. తొలి వన్డేలో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ బవుమా, కేశవ్ మహారాజ్ రెండవ వన్డేలో ఆడ బోతున్నారు. బవుమా కోసం రికెల్టన్, క్వింటన్ డికాక్ లలో ఎవరో ఒకరు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరూ తొలి వన్డేలో దారుణంగా విఫలమయ్యారు. భారత బ్యాటర్ల దూకుడు వల్ల తొలి వన్డేలో సుబ్రయన్ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కేశవ్ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. రాంచీ వన్డేలో 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఒక దశలో 130/5 వద్ద నిలిచినప్పటికీ.. దక్షిణాఫ్రికా గెలుపు మీద ఆశలు ఏమాత్రం కోల్పోలేదు. సఫారీ జట్టు బౌలింగ్ లో యాన్సన్, బర్గర్, కేశవ్ మీద భారీ ఆశలు పెట్టుకుంది.