Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయి దాకా రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా ఒడిదుడుకులను చవి చూశాడు. చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. అయితే చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే నితీష్ కుమార్ రెడ్డికి విపరీతమైన ఇష్టం. అంతేకాదు టీం ఇండియాలో విరాట్ కోహ్లీ అంటే చెవి కోసుకునేవాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే ఎగిరి గంతేసేవాడు. అదే సమయంలో అవుట్ అయితే దిగాలు పడేవాడు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ చూస్తూ ప్రాక్టీస్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. నేడు విరాట్ కోహ్లీ తో టెస్ట్ క్రికెట్ ఆడటం గమనార్హం.. నేటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని నితీష్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు.. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. ఒకప్పుడు విరాట్ కోహ్లీని చూడాలని.. అతడితో ఫోటో దిగాలని నితీష్ కుమార్ రెడ్డి అనుకునేవాడు. ఒక సందర్భంలో విరాట్ కోహ్లీని కలిసే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి వచ్చింది. ఫోటో దిగడానికి ప్రయత్నించినప్పుడు విరాట్ కోహ్లీ బౌన్సర్లు అతడిని అడ్డుకున్నారు. సీన్ కట్ చేస్తే నేడు అదే విరాట్ తో చప్పట్లు కొట్టించుకునే స్థాయికి నితీష్ కుమార్ రెడ్డి ఎదిగాడు.
అరుదైన కానుక
తనంటే నితీష్ కుమార్ రెడ్డికి విపరీతమైన ప్రేమ అని విరాట్ కోహ్లీకి తెలుసు. పలు సందర్భాల్లో నితీష్ కుమార్ రెడ్డి ఈ విషయం చెబుతుంటే అతడు తెలుసుకున్నాడు. తనను అమితంగా ఆరాధించే నితీష్ కుమార్ రెడ్డికి విలువైన కానుక ఇవ్వాలని విరాట్ కోహ్లీ భావించాడు. ఈ క్రమంలో మెల్ బోర్న్ లో మ్యాచ్ ముగిసిన అనంతరం నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులను, సోదరిని తన వద్దకు పిలిపించుకొని ఒక ఫోటో దిగాడు విరాట్ కోహ్లీ.. అంతేకాదు విరాట్ కోహ్లీ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ ను అందుకొని..ఈ స్థాయి లో పేరు తెచ్చుకోవడంతో నితీష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.. అయితే నితీష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో రవి శాస్త్రి కన్నీటి పర్యంతమయ్యాడు. అతడు ఆడుతున్న తీరు చూసి భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడు. అంతేకాదు టీమిండియాకు భవిష్యత్తు ఆశకిరణం దొరికిందని.. అతడిని గనుక సాన పెడితే తిరుగు ఉండదని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు రవి శాస్త్రి కూడా నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరుపై ప్రత్యేకంగా మాట్లాడారు..” అతడు భయం అనేది లేకుండా ఆడుతున్నాడు. ఎలాంటి బౌలర్ అయిన ఎదుర్కొనగలను అనే ధైర్యంతో ఆడుతున్నాడు. అటువంటి వ్యక్తికి కొత్తగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు తీసుకొస్తే చాలు.. నితీష్ పై బాధ్యత మరింత పెరుగుతుంది. అది జట్టుకు చాలా లాభం చేకూర్చుతుందని” రవి శాస్త్రి పేర్కొన్నాడు. అయితే విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోలు తన సామాజిక మాధ్యమ ఖాతాలలో నితీష్ కుమార్ రెడ్డి పోస్ట్ చేసుకున్నాడు.. అభిమాన ఆటగాడితో మెల్ బోర్న్ లో ఓ అద్భుతమైన రాత్రి.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫ్యాన్ కల నెరవేరిన వేళ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు.