Virat Kohli Orange Cap 2026: అదే ఫిట్నెస్.. అదే యాంగ్రీ నెస్.. అదే అగ్రెసివ్నెస్.. సంవత్సరం మారుతోంది. ఆడే వేదిక మారుతుంది. ఆ మనిషికి వయసు కూడా పెరుగుతోంది. కానీ ఆట తీరు అంతకుమించి అనే స్థాయిలో ఎదుగుతోంది. పరుగులు తీయడంలో.. పరాక్రమాన్ని ప్రదర్శించడంలో.. దూకుడుగా ఆడటంలో.. అతడు అంతకుమించి అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడు. అందువల్లే నేటి కాలంలో కూడా పరుగుల యంత్ర గాడు అనే బిరుదును తనకు మాత్రమే సొంతమని.. అది తనకు పాదాక్రాంతమని నిరూపిస్తున్నాడు.
ఐపీఎల్ లో ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన వారంతా యంగ్ ప్లేయర్లు. ఇందులో 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ నుంచి మొదలు పెడితే ఇషాన్ కిషన్ వరకు అందరూ యువ రక్తం ఉన్నవారే. కానీ వారందరిని దాటుకొని.. నేనున్నాను.. నేను మాత్రమే ఉన్నాను అన్నట్టుగా దూసుకు వచ్చాడు విరాట్ కోహ్లీ. బుధవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 49 పరుగులు చేయడం ద్వారా.. ఆరెంజ్ క్యాప్ బిరుదాంకితుడయ్యాడు.
ప్రస్తుత ఐపిఎల్ లో ఐదు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ.. 228 పరుగులు చేశాడు. 57 సగటు, 158.33 స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్నాడు. ఇతడి బ్యాట్ నుంచి 25 ఫోర్లు, 8 సిక్సర్లు వచ్చాయి.. ఇతడి తర్వాత స్థానంలో క్లాసెన్ 224( సన్ రైజర్స్), పాటిదార్222( బెంగళూరు) కొనసాగుతున్నారు. బుధవారం నాటి లక్నో మ్యాచ్లో విరాట్ కోహ్లీ (49) ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. అయినప్పటికీ బెంగళూరు జట్టు సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు పడుతున్నా.. అతడు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. లక్నో బౌలర్ల పై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తద్వారా తనకు వయసు అనేది లెక్క కాదని.. తన ఫిట్నెస్ ఎప్పటికీ యంగ్ గానే ఉంటుందని నిరూపించాడు.
ఇటీవల జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాస్త అసౌకర్యంగా కనిపించాడు. మైదానంలో ఫీల్డింగ్ చేసేందుకు రాలేదు. దీంతో విరాట్ కోహ్లీ పని అయిపోయిందని ప్రచారం మొదలైంది. కొందరు అతడు 2027 వరల్డ్ కప్ ఆడలేడని స్పష్టం చేశారు. అతడికి మునుపటి మాదిరిగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేదని కామెంట్లు మొదలుపెట్టారు. కానీ వారందరికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ. తనను పరుగుల చీతా అని.. రన్ మిషన్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు.