Virat Kohli: భారత క్రికెట్ జట్టు పగ్గాలు మరోసారి మారనున్నాయా..? మళ్లీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించనున్నారా..? అంటే అవునన్నా సమాధానమే క్రికెట్ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత ఆటగాళ్లతోపాటు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్ గాను, ఆటగాడిగాను డబ్ల్యూటిసి ఫైనల్ లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తొలగించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది.
భారత జట్టుకు సారథులుగా వ్యవహరించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. భారత జట్టు కెప్టెన్ గా అనేక విజయాలను అందించి పెట్టాడు. టెస్ట్ క్రికెట్ లో అయితే కోహ్లీ మరో కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో రికార్డ్ స్థాయి విజయాలను భారత జట్టుకు అందించాడు. 2021 టి20 వరల్డ్ కప్ కు ముందు, ఆ తరువాత వన్డే కెప్టెన్సీకి, 2002 లో దక్షిణాఫ్రికా టూర్ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో కెప్టెన్ కు సాధ్యంకాని రీతిలో కోహ్లీ గొప్ప విజయాలను భారత జట్టుకు అందించి పెట్టాడు. 2014 నుంచి 2022 వరకు జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ 68 టెస్టుల్లో.. 58.82% శాతంతో 39 టెస్టుల్లో జట్టుకు విజయాలను అందించాడు. మరో పదహారు టెస్టుల్లో జట్టు ఓటమిపాలైంది.
అలాగే వన్డే జట్టుకు కెప్టెన్ గా 95 మ్యాచ్ లకు వ్యవహరించాడు. ఇందులో 68.42 శాతంతో 41 మ్యాచ్ ల్లో జట్టుకు విజయాలను అందించగా, 27 మ్యాచ్ ల్లో జట్టు ఓటమిపాలైంది. అలాగే టి20 కెరియర్ లోను అద్భుత విజయాలను జట్టుకు అందించాడు కోహ్లీ. 50 టి20 మ్యాచ్ ల్లో జట్టుకు సారథిగా వ్యవహరించిన కోహ్లీ 64.58 శాతంతో 27 మ్యాచుల్లో విజయాలను అందించాడు. 16 మ్యాచ్ లో మాత్రమే జట్టు వాటిని పాలైంది. ఈ విధంగా భారత జట్టు కోహ్లీ సారధ్యంలో అద్భుత విజయాలను నమోదు చేసింది. రోహిత్ శర్మతో పోలిస్తే కోహ్లీ కెప్టెన్సీ మెరుగ్గా ఉంటుందన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అందిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ ఆటగాడిగా విఫలమవుతున్నాడు అన్న విమర్శలు నేపథ్యంలో కోహ్లీకి మళ్ళీ పగ్గాలు అప్పగించాలి అన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే, బీసీసీఐ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా..? అన్నది వేచి చూడాల్సి ఉంది. వరల్డ్ కప్ కు ముందు ఇటువంటి ప్రయోగం చేసేందుకు బీసీసీఐ మార్పులకు ఇష్టపడకపోయినా.. మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే మాత్రం కచ్చితంగా కెప్టెన్సీలో మార్పులు ఉంటాయన్న నమ్మకాన్ని మాత్రం క్రికెట్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.