Virat Kohli Allu Arjun controversy : అభిమానం ఉండాలి. కానీ అది లైన్ దాటిపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. అది ఎంతలా ఉంటుందనేది తెలుగు నాట అల్లు అర్జున్.. క్రికెట్ నాట విరాట్ కోహ్లీ కి అర్థమైంది. నిన్నటిదాకా వీరిద్దరూ మీడియాను షేక్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభంజన సృష్టించారు. ఇక వీళ్ళ అభిమానుల సందడి మామూలుగా ఉండేది కాదు. వారు చూపించే దూకుడుకు కొలమానం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సంధ్య థియేటర్ ఘటన జరిగిందో అల్లు అర్జున్ తలవంపులకు గురికావాల్సి వచ్చింది. ఒకరోజు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అంతేకాదు తను సాధించిన విజయాన్ని గొప్పగా ఆస్వాదించకుండా దూరంగా ఉండి పోవాల్సి వచ్చింది.. అంతేకాదు మీడియాలో తిట్లు.. సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అల్లు అర్జున్ పై ఎదురైన విమర్శలను తిప్పి కొట్టడానికి ఆయన అభిమానులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆయన పీఆర్ టీమ్ రంగంలోకి దిగినప్పటికీ అంతగా ప్రయోజనం లభించలేదు. ఒక రకంగా అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా వివాదానికి ముందు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకంగా నెంబర్ వన్ పొజిషన్ కు అర్హుడయ్యే నటుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో.. అతడి చరిష్మా తగ్గిపోయింది. అతడు మాట్లాడిన మాటలు కూడా వివాదంగా మారిపోయాయి. అందువల్లే ఆయన కొంతకాలంగా మీడియాకు.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. వాస్తవానికి అల్లు అర్జున్ స్థానంలో ఇంకో నటుడు గనుక ఉండి ఉంటే.. అతడికి గనుక పుష్ప -2 సినిమా రేంజ్ హిట్ కనక లభించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన.. ఆ తర్వాత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలచివేతకు గురిచేశాయి. తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు ఇక అల్లు అర్జున్ ఎటువంటి అడుగులు వేస్తాడనేది ఆసక్తి కరం.
ఇక విరాట్ కోహ్లీ క్రికెట్లో సరికొత్త సంచలనం. దశాబ్ద కాలానికి మించి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. అతడి సామర్ధ్యం తగ్గలేదు. అతడికి ఉన్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. అంతకుమించి అనే రేంజ్ లోనే అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. అతడు మైదానంలో అడుగుపెడితే పూనకాలుగే అభిమానులు ఉన్నారు. అందువల్లే అతనిని భారత క్రికెట్లో గోట్ అని పిలుస్తుంటారు. అంతటి ఆటగాడు ఉన్నప్పటికీ కర్ణాటక జట్టు 2024 వరకు ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. కానీ ఈ సీజన్లో మాత్రం అద్భుతం అనే రేంజ్ లో ఆడి.. అనన్య సామాన్యమైన ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ కాస్త ఆవేశపడ్డాడు. సంబరాలకు సిద్ధంగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. అతడు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశాడో తెలియదు గాని.. ఆ తదుపరి జరిగిన విజయ యాత్ర బెంగళూరులో విషాదయాత్రగా మిగిలిపోయింది. దాదాపు పదికిమించి అభిమానులు కన్నుమూశారు. 60 కి లోపు మంది గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటక రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలలో కూడా కలకలం రేపుతోంది. ఒకానొక సందర్భంలో విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది. ఈ వ్యవహారానికి విరాట్ కోహ్లీకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి విరాట్ కోహ్లీది. ఇప్పటికే గౌతమ్ గంభీర్ పరోక్షంగా విమర్శలు చేశాడు. బీసీసీఐ సెక్రటరీ నేరుగానే చురకలు అంటించాడు. ఇక మిగతా సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
బెంగళూరు ఘటన తర్వాత రన్ మిషన్ ఏవిధంగా స్పందిస్తాడనేది యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే కర్ణాటక జట్టు విజయం సాధించిన తర్వాత ఆ గెలుపును మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని దుస్థితి ఆ జట్టు ఆటగాళ్లది. ఇందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఇటీవల అతడు తన కుటుంబంతో కలిసి ముంబై వెళ్తున్నప్పుడు అత్యంత విచారమైన స్థితిలో కనిపించాడు. కనీసం విలేకరులు ప్రశ్నిస్తే మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. ఒకరకంగా అత్యంత నిర్వేదంలో అతడు కనిపిస్తున్నాడు. నిన్నటిదాకా కన్నడ జట్టు ఆరాధ్య ఆటగాడిగా.. క్రికెట్లో పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న అతడు ఒక్కసారిగా ఇలా అపరాధ భావంలో కృంగిపోవడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగులో అల్లు అర్జున్.. క్రికెట్లో విరాట్ కోహ్లీ.. వ్యక్తులు మాత్రమే వేరు.. జరిగిన ఘటనలు ఒకటే. ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా ఒకటే. మరి వీటి నుంచి వారిద్దరు ఎలా బయటపడతారు అనేది చూడాల్సి ఉంది.