Vijay Hazare Trophy Axar Patel: విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare trophy)లో భాగంగా శనివారం బెంగళూరులోని ఆలూరు క్రికెట్ స్టేడియంలో గుజరాత్, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు తరఫున అక్షర్ పటేల్ (Axar Patel) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి బ్యాటింగ్ దూకుడుకు ఆంధ్ర బౌలర్లు తలవంచారు.
ఆలూరు స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జాతీయ జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సంచలన బ్యాటింగ్ చేశాడు. 98 బంతుల్లోనే మూడు అంకెల స్కోర్ చేశాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో ఆంధ్ర బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచాడు. ఒకానొక దశలో గుజరాత్ జట్టు మూడు వికెట్ల కోల్పోయి 29 పరుగులు చేసింది. ఈ దశలో అక్షర్ బ్యాటింగ్ కు దిగాడు. జయమిత్ పటేల్ తో కలిసి నాలుగో వికెట్ కు 51 పరుగులు జోడించాడు. ఆరో వికెట్ కు విశాల్ జైస్వాల్ తో కలిసి 142 పరుగులు జోడించాడు. ప్రారంభంలో జాగ్రత్తగా ఆడిన పటేల్.. ఆ తర్వాత దూకుడు కొనసాగించాడు. మిద్దె ఆంజనేయులు బౌలింగ్లో అక్షర్ పటేల్ ఔట్ అయ్యాడు.
అక్షర్ పటేల్ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 130 పరుగులు చేశాడు. ఇతడి అద్భుతమైన ఆటతీరు వల్ల గుజరాత్ జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. లిస్టు ఏ క్రికెట్లో అక్షర్ పటేల్ కు ఇది తొలి సెంచరీ. గతంలో అతడు 12 హాఫ్ సెంచరీలు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో అక్షర్ అత్యుత్తమ స్కోరు 98 పరుగులు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇప్పటివరకు అతడు 171 మ్యాచ్ లు ఆడాడు. 2,881 పరుగులు చేశాడు. సగటు 30 పరుగులుగా కొనసాగిస్తున్నాడు.
లిస్ట్ ఏ క్రికెట్ లో బౌలింగ్ లో కూడా అక్షర్ పటేల్ సత్తా చూపించాడు. తన ఎడమ చేతివాటం స్పిన్ తో 4.03 ఎకనామితో.. 203 వికెట్లు పడగొట్టాడు. జాతీయ జట్టులో 71 వన్డేలలో అక్షర్ ప్రాతినిధ్యం వహించాడు. జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తూ.. జాతీయ జట్లు తనకు సుస్థిరమైన స్థానం లభించే విధంగా చూసుకుంటున్నాడు. అక్షర్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో మేనేజ్మెంట్ ఏం చేస్తుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ లో టి20 జట్టుకు వైస్ కెప్టెన్ గా గిల్ ను మేనేజ్మెంట్ నియమించింది. వాస్తవానికి ఆస్థానంలో అక్షర్ ఉండాలి. చివరికి మేనేజ్మెంట్ తప్పు తెలుసుకుని గిల్ ను ఆ స్థానం నుంచి తప్పించింది.