Vaibhav Suryavanshi Orange Cap IPL: వైభవ్ సూర్య వంశీ కి ఆరెంజ్ రంగు అంటే చాలా ఇష్టం అనుకుంటా. అది తన నుంచి ఇతరుల వద్దకు వెళుతుంటే అతడు తట్టుకోలేకపోతున్నాడు. అందువల్లే దాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరికి దానిని దక్కించుకొని కలను నెరవేర్చుకుంటున్నాడు.
15 సంవత్సరాల వైభవ్ ఆడుతోంది రెండవ ఐపిఎల్ సీజన్. రాజస్థాన్ జట్టుకు ఓపెనర్ గా వస్తున్న అతడు.. మూల స్తంభం లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూకుడుగా బంతిని కొడుతున్నాడు. అందువల్లే అతడి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం వస్తోంది. హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో అతడు సెంచరీ చేశాడు.. ఆ తర్వాత పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 43 పరుగులు చేశాడు. అతడు చేసిన ఆ పరుగులు ఆ జట్టు విజయానికి దోహదం చేశాయి. అంతేకాదు వైభవ్ సూర్య వంశీ ని ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి.
వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఇతడు తొమ్మిది మ్యాచ్లలో 238 స్ట్రైక్ రేటుతో 400 పరుగులు చేశాడు.. ఈ జాబితాలో వైభవ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 25న నలుగురు ప్లేయర్ల చేతుల్లోకి ఆరంజ్ క్యాప్ వెళ్ళింది. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ (380) దగ్గర ఆరెంజ్ క్యాప్ ఉంది.. అయితే 43 పరుగులు చేయడంతో వైభవ్ సూర్య వంశీ పరుగుల సంఖ్య 400కు చేరుకుంది. దీంతో అతడు మరోసారి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఆవిర్భవించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ ను సూర్య వంశీ తల మీద పెట్టాడు. దానిని అతడు అదే స్థాయిలో స్వీకరించి.. తల మీద ధరించాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఆవిర్భవించడం ఇది సూర్య వంశీకి రెండవది. ప్రస్తుత ఐపీఎల్లో సూర్య వంశీ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. సిక్సర్లను అలవోకగా కొడుతున్నాడు. అందువల్లే అతడు చేసిన పరుగులు 400కు చేరుకున్నాయి.
సూర్య వంశీ ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడి బ్యాటింగ్ చూస్తుంటే గేల్ ను మరిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్ లో బెంగళూరు తరఫున ఆడిన గేల్ అనేక రికార్డులను తన పేరు మీద సృష్టించుకున్నాడు. ఇప్పుడు వరకు ఆ రికార్డులు అలానే ఉన్నాయి. సూర్య వంశీ ఫామ్ చూస్తుంటే.. అతడు త్వరలోనే ఆ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా లెగ్ సైడ్ బంతులను అతడు సిక్సర్లు కొట్టే విధానం గొప్పగా ఉందని చెబుతున్నారు.
