Vaibhav Suryavanshi: ప్రస్తుత ఐపిఎల్ లో అత్యంత వేగంగా ఆడుతున్న ఆటగాడు.. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు కొడుతున్న ఆటగాడు.. జెర్సీ వేసుకున్నత సులభంగా ఫోర్లు కొడుతున్న ఆటగాడు.. ప్రారంభం నుంచి పెవిలియన్ చేరుకునే వరకు ఓకే టెంపోలో ఆడుతున్న ఆటగాడు.. ఇన్ని ఉపమానాలకు దొరికిన ఏకైక పదం వైభవ్ సూర్య వంశీ. 15 సంవత్సరాల వయసులో ఇతడు ఐపీఎల్లో సృష్టిస్తున్న అద్భుతాలు మామూలువి కావు. గొప్ప గొప్ప ఆటగాళ్లు సైతం ఊహించడానికి భయపడే రికార్డులను ఇతడు అవలీలగా దాటేస్తున్నాడు.
వైభవ్ సూర్య వంశీ ఆట గురించి ఇప్పటికే ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు గొప్పగా చెప్పేశారు. చెబుతూనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న సూర్య వంశీ.. ప్రతి మ్యాచ్లో కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. దూకుడుగా ఆడటం.. ప్రారంభం నుంచి ఎదురుదాడికి దిగడం వంటివి చేస్తున్నాడు. దీనివల్ల బౌలర్లలో మానసికస్థైర్యం తగ్గిపోతుంది. ఇదే అదునుగా వైభవ్ తన బ్యాట్ కు మరింత పదును పెడుతున్నాడు. చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టించి వెళ్ళిపోతున్నాడు. వైభవ్ ఆడుతున్నంత సేపు కొండంత లక్ష్యం సైతం ఇసుక రేణువు లాగా మారిపోతుంది. ఇది ఒక రకంగా ప్రత్యర్థులకు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తోంది.
సూర్య వంశీ ఆట తీరు గొప్పగానే ఉన్నప్పటికీ.. అతని బ్యాటింగ్ స్టైల్ మీద కొంతమంది విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడే విధానాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో సమస్యలు ఎదురవుతాయని.. అవి కెరియర్ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేస్తాయని వారు గుర్తు చేస్తున్నారు. షార్ట్ పిచ్ బంతులను ఆడ లేకపోవడం.. నిలకడ లేకపోవడం.. టెక్నిక్ ప్రదర్శించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు సూర్యవంశకి సూచిస్తున్నారు. ఒకటి రెండు ఇన్నింగ్స్ లలో బీభత్సంగా బ్యాటింగ్ చేయడం ద్వారా అంచనాలు పెరిగిపోతాయని.. ఆ తర్వాత ప్రతి మ్యాచ్లో కూడా గొప్పగా ఆడాల్సిన అవసరం ఏర్పడుతుందని.. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవని.. ఒకసారి డౌన్ ఫాల్ మొదలైతే అది కంటిన్యూ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వైభవ్ సూర్య వంశీ విఫలం అవుతూ ఉండటం వల్ల.. అది జట్టు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఒకప్పుడు పృథ్వి షా కూడా ఇలానే ఆడేవాడని.. ఆ తర్వాత అతని లోపాలను ప్రత్యర్థి బౌలర్లు గుర్తించారని.. పదేపదే అదే స్టైల్ లో బంతులు వేయడంతో అతడు వికెట్ సమర్పించుకున్నాడని గుర్తు చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. నిలకడ లోపం వల్ల పృథ్వి ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. చివరికి ఐపీఎల్ లో కూడా తుది జట్టులో చోటు సంపాదించుకోలేకపోతున్నాడు. పృద్వి ఉదంతాన్ని వైభవ్ సూర్య వంశీ గుర్తుకు తెచ్చుకోవాలని క్రికెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా అతడికి విన్నవిస్తున్నారు.