Vaibhav Surya Vanshi : ఐపీఎల్ లో ఎంతోమంది ఆటగాళ్లు వచ్చి వెళ్లినప్పటికీ.. సూపర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. గేల్, డివిలియర్స్ లాంటి ఆటగాళ్లకు ఇప్పటికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందంటే ప్రధానమైన కారణం.. వారు వేగంగా ఆడిన తీరే.. ఎందుకంటే ఐపీఎల్లో తక్కువ ఓవర్లు ఉంటాయి. ఎక్కువ పరుగులు చేయాలి. అందువల్లే ఆటగాళ్లు అత్యంత వేగంగా ఆడాలి. ఇందులోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. వికెట్ పడేసుకోకుండా.. ప్రత్యర్థి బౌలర్ల పై ప్రారంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి. అప్పుడే బ్యాటర్లు చిరస్థాయిగా నిలిచిపోతారు. తమ జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ అత్యంత సులభంగా చేరిపోయాడు. సాధారణంగా ఈ వయసులో ఏ ఆటగాడు కూడా అందుకోలేని రేర్ రికార్డ్ అతడు సొంతం చేసుకున్నాడు. కనీసం కలలో కూడా ఊహించని ఘనతను అతడు తన పాదాక్రాంతం చేసుకున్నాడు. అందువల్లే వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. చివరికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా వైభవ్ సూర్యవంశీ నామస్మరణ చేస్తున్నాడు అంటే అతడి ఇంఫాక్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాన్నకు ప్రేమతో
వైభవ్ సూర్యవంశీది ఆర్థికంగా స్థితివంతమైన కుటుంబం కాదు. అతడి తండ్రి బీహార్ రాష్ట్రంలోని ఒక సాధారణ జర్నలిస్టు. చిన్నప్పటినుంచి వైభవ్ సూర్య వంశీకి క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో.. అతడిని ఆ దిశగా ప్రోత్సహించాడు.. తన ఇంటిలోని ఖాళీ స్థలాన్ని క్రికెట్ మైదానం గారు రూపొందించాడు. వైభవ్ సూర్యవంశీకి ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీని ప్రొఫెషనల్ క్రికెటర్ గా తయారు చేయడానికి అతని తండ్రి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి తన కొడుకుని అద్భుతమైన క్రికెటర్ గా రూపొందించాడు. వైభవ్ సూర్య వంశీ కోసం ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య చివరి వరకు పోటీ నడిచింది అంటే.. అతడి రేంజ్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా రాజస్థాన్ జట్టు ఆలస్యంగానైనా సూర్యవంశీ ఆడిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో సూర్యవంశీ తను ఏంటో ప్రూఫ్ చేసుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్లో తొలి బంతికే సిక్సర్ కొట్టి అదరగొట్టాడు. శార్దుల్ ఠాకూర్ లాంటి బౌలర్ కు డేంజర్ సిగ్నల్స్ పంపించాడు. చివరికి మూడో మ్యాచ్లోనే సూపర్ సెంచరీ కొట్టి.. శిఖర స్థాయిలో నిలిచాడు