Vaibhav Surya Vanshi అతడు ఎదుర్కొంది కేవలం 17 బంతులు మాత్రమే.. కానీ అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బంతితో ఏదో విరోధం ఉన్నట్టు.. బౌలర్ తో గెట్టు పంచాయతీ ఉన్నట్టు.. గుజరాత్ జట్టు అంటే శత్రుత్వం ఉన్నట్టు.. పిచ్చకొట్టుడు కొట్టాడు. ఓ ఎండ్ లో యశస్వి జైస్వాల్ ఉన్నప్పటికీ.. అతడిని కూడా ప్రేక్షక పాత్రకు పరిమితం చేసి.. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్ సూర్య వంశీ. ఇశాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్.. గుజరాత్ జట్టు హేమహేమి బౌలర్లను సైతం పడుకోబెట్టాడు. వైభవ్ సూర్య వంశీ ఇన్నింగ్స్ లో ఫోర్ల కంటే సిక్సర్లే అధికంగా ఉన్నాయి. అతడి బ్యాట్ నుంచి మూడు ఫోర్లు మాత్రమే రాగా.. సిక్సర్లు మాత్రం ఆరు వచ్చాయి. ముఖ్యంగా ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉండడం విశేషం.. ఇషాంత్ శర్మ బౌలింగ్లో సూర్య వంశీ అన్ని భారీ షాట్లు ఆడటం ఇక్కడ విశేషం.. ఇషాంత్ శర్మ వేసిన ఓవర్లో మొత్తంగా 28 పరుగులు సాధించి.. కేవలం 17 బంతుల్లోనే వైభవ్ సూర్య వంశీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
సరికొత్త రికార్డు
17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశం సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అత్యంత వేగమైన హాఫ్ సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశం రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుపై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ వయసులో (14 సంవత్సరాలు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.. ఇటీవల రాజస్థాన్ జట్టుతో తొలి మ్యాచ్లో 30 కి పైగా పరుగులు, రెండవ మ్యాచ్ లో 20 కి దరిదాపు పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచ్లో మాత్రం స్థిరంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నాలుగు వికెట్లు లాస్ అయి 209 రన్స్ చేసింది. ఇక 210 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఈ కథనం రాసే సమయం వరకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 8 ఓవర్లలో 106 పరుగులు చేసింది. వైభవ్ సూర్య వంశీ 59, యశస్వి జైస్వాల్ 45 క్రీజ్ లో ఉన్నారు.