ట్విటర్ మరో కుట్రకు తెరలేపింది. ప్రముఖుల ఖాతాల నుంచి బ్లూ మార్క్ టిక్ తొలగిస్తూ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ట్విటర్ మరో కోణంలో తన పాత్ర గురించి తానే కయ్యం పెంచుకుంటోంది. గతంలోనే మన ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఖాతా బ్లూ టిక్ ను తొలగించి దేశవ్యాప్తంగా విమర్శల పాలైన ట్విటర్ ఇపుడు మాజీ క్రికెట్ జట్టు సారధి మహేంద్రసింగ్ ధోని ఖాతాకు ఉన్న బ్లూ మార్క్ టిక్ ను తొలగించి దేశవ్యాప్తంగా మరో సంచలనానికి కేంద్ర బిందువైపోతోంది.
ట్విటర్ యాజమాన్యం శుక్రవారం ఎంఎస్ ధోని ఖాతా బ్లూ టిక్ తీసేసింది. అయితే మహేంద్రసింగ్ ధోని ట్విటర్ ఖాతా కొన్ని నెలలుగా ఇన్ యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి పోస్టు జనవరి 8న పోస్టు చేసినట్లు గుర్తించారు. ధోనీ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండరనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయం కూడా ఆయన భార్య సాక్షిసింగ్ ధోని చెప్పితేనే తెలిసింది. దీంతో ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ధోని అభిమానులు ట్విటర్ యాజమాన్యంపై విమర్శలు చేస్తున్నారు. తక్షణమే బ్లూ టిక్ పెట్టాలంటూ పెద్ద ఎత్తున గోల చేస్తున్నారు.
ధోనీ చివరిగా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. న్యూజీలాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో 18 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి చవిచూసింది. తరువాత మహేంద్ర సింగ్ ధోని ఆటకు వీడ్కోలు పలికారు. గత ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ కెరీర్ లో ధోని 90 టెస్ట్ మ్యాచ్ ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్థ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్ ల్లో 10773 పరుగులు తీశాడు. 10 శతకాలతోపాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. ఇక 98 టీ20 మ్యాచ్ ల్లో 1600 పరుగులు సాధించాడు.
ట్విటర్ లో బ్లూ టిక్ అంటే ఏమిటనే విషయం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ట్విటర్ రూల్స్ ప్రకారం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) ఉంటే ఖాతా విలువైనదిగా భావిస్తారు. వార్తా సంస్థలు, జర్నలిస్టులు, వినోదం, క్రీడలు, ఈ స్పోర్ట్స్, కార్యకకర్తలు, నిర్వాహకులు తదితరులు నిర్దిష్ట ఖాతాలను ధ్రువీకరించి బ్లూ టిక్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది ట్విటర్ ఖాతాలు బ్లూ టిక్ పొందాయి. నిబంధనల ప్రకారం బ్లూ టిక్ ను తొలగించే అధికారం కలిగి ఉంటుంది. అయితే ఖాతా మనుగడలో లేకపోయినా ఆ బ్లూ టిక్ ను ట్విటర్ తొలగిస్తుంది. దీనిపై ఇప్పటికే పలు రకాలుగా దుమారం రేగుతోంది.