వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశంలో ఒక్క ఒలంపిక్ స్వర్ణం కోసం మొహం వచిపోవడం ప్రతిసారీ జరుగుతున్నదే. ఈ సారి ఎలాగైనా బంగారు పతకాన్ని పట్టుకు వచ్చేందుకు భారీ సంఖ్యలో వెళ్లారు భారత క్రీడాకారులు. ఇప్పటి వరకూ ఎంతో మంది వెనుదిరగగా.. మరికొందరు మెరిశారు. ఏడో రోజైన శుక్రవారం ఇండియన్ క్రీడాకారుల ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం.
భారతీయు క్రీడా ప్రేమికులు సంతోషించే విషయం ఏమంటే.. బాక్సర్ లవ్లీనా బొర్గోహై పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం 69 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ ఫైట్ లో.. చైనాకు చెందిన చిన్ చెన్ ను ఓడించి సెమీస్ చేరింది. దీంతో.. కనీసం కాంస్య పతకం ఖాయమైపోయింది. బౌట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లవ్లీనా.. వరుస పంచ్ లతో ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. అదే టెంపో కొనసాగించి, తిరుగులేని విజయాన్ని అందుకుంది. సెమీస్ లో నెగ్గితే రజతం ఖాయమైపోతుంది.
ఇక, మరో గుడ్ న్యూస్ ఏమంటే.. ఖచ్చితంగా ఏదో ఒక పతకం తెస్తుందన్న అంచనాతో టోక్యోలో అడుగు పెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ సింధూ.. సెమీస్ చేరింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ అకానె యమగూచిపై విజయం సాధించింది. ఇవాళ (శనివారం) జరగనున్న సెమీస్ లో వరల్డ్ నంబర్ వన్ తైజూ యింగ్ (చైనీస్ తైపీ)తో తలపడనుంది. గతానుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. తైజూ యింగ్ కే మెరుగైన రికార్డు ఉంది. మరి, సింధూ ఎలా తిప్పికొడుతుందన్నది ఆసక్తికరం.
అటు హాకీ జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇప్పటికే.. క్వార్టర్ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకున్న టీమిండియా జట్టు.. చివరి లీగ్ మ్యాచ్ లోనూ సూపర్ విక్టరీ కొట్టింది. జపాన్ తో జరిగిన మ్యాచ్ లో 5 – 3 తేడాతో విజయం సాధించింది. మహిళ హాకీ టీమ్ సైతం మొదటి మ్యాచ్ గెలిచింది. తప్పక విజయం సాధించిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై 1 – 0 తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో క్వార్టర్ ఫైనల్ ఆశలు నిలుపుకుంది. ఆర్చరీ, షూటింగ్ లో భారత్ కు నిరాశే ఎదురైంది.