Tilak Varma: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి దశ పోటీలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని జట్లు మైదానంలో కసరత్తు ప్రారంభించాయి. కీలక ఆటగాళ్లు చెమటలు చిందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరాలలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని జట్ల కంటే ముందుగానే ముంబై జట్టు క్యాంపు ఏర్పాటు చేసింది. కీలక ఆటగాళ్లు అందులో చేరి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం పంచుకుంది. అందులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రాక్టీస్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటున్నది.
తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్, కుడి చేతివాటం బౌలింగ్ తో తిలక్ వర్మ తనదైన రోజు అద్భుతం చేయగలడు. గత సీజన్లో ముంబై జట్టు తరఫున విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.. గత ఏడాది జరిగిన ఐపీఎల్లో 11 మ్యాచ్ లు ఆడి 343 పరుగులు చేశాడు. (ఇందులో 23 ఫోర్లు, 26 సిక్సర్లు ఉన్నాయి) గత ఏడాది సీజన్ లో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 84. దూకుడయిన బ్యాటింగ్ కు సిసలైన అర్థం చెప్పే తిలక్ వర్మను ముంబై జట్టు 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం శిక్షణ శిబిరంలో అతడు ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ స్టైల్ తో అదరగొడుతున్నాడు. అతడు కొట్టిన ఒక బంతి స్టేడియం అవతల పడింది.
తెలుగు కుర్రాడైన తిలక్ వర్మ 2022లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్ లు ఆడాడు. 397 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ సీజన్లో అతడి వ్యక్తిగత స్కోరు 61 పరుగులు. 2022 తిలక్ వర్మ 29 ఫోర్లు, 16 సిక్స్ లు బాదాడు. ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు తిలక్ వర్మ పై భారీ అంచనాలను పెట్టుకుంది. ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న తీరు చూస్తే తిలక్ వర్మ అంచనాలు నిజం చేసేలా ఉన్నాడు.. లసిత్ మలింగ, ఇషాన్ కిషన్ వంటి వారితో తిలక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెమటలు చిందిస్తూ బంతులను బౌండరీల వైపు తరలిస్తున్నాడు. మరోవైపు బౌలింగ్ లోనూ అదే స్థాయిలో ప్రదర్శన చేస్తున్నాడు. గింగిరాలు తిప్పే బంతులు వేస్తూ వికెట్లను నేల కూల్చుతున్నాడు.
Tilak’s bat striking the chord in the nets #OneFamily #MumbaiIndians #NetSetGo @TilakV9 pic.twitter.com/jcsT3NfYBX
— Mumbai Indians (@mipaltan) March 18, 2024