https://oktelugu.com/

IND vs AUS: మూడు దశాబ్దాల తర్వాత ఈసారి ఐదు టెస్టులు.. బోర్డర్ గవాస్కర్ పూర్తి షెడ్యూల్ ఇదే

నవంబర్ 22 నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుంది. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 20, 2024 11:23 am
Border Gavaskar Trophy Schedule

Border Gavaskar Trophy Schedule

Follow us on

IND vs AUS: గత రెండు సీజన్లలో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ ఘనతను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా భారత్ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని ఆస్ట్రేలియా కృత నిశ్చయంతో ఉంది. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల సిరీస్ గా నిర్వహిస్తున్నారు. దీంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పై పడింది. 2014 -15 సీజన్ నుంచి భారత జట్టు పై స్వదేశంలో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలవలేదు. అయితే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టును ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్వదేశంలో ఓడించారు. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోనూ ఓడించి గదను సొంతం చేసుకున్నారు.. దీంతో భారత్ ఆస్ట్రేలియాపై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఎలాగైనా బోర్డర్ గావస్కర్ ట్రోఫీని గెలుచుకోవాలని భావిస్తోంది. అయితే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ 0-3 తేడాతో ఓడిపోయింది. దీంతో వచ్చే ఏడాది లార్డ్స్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో భారత్ ప్రవేశించడం సంక్లిష్టంగా మారింది. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో అడుగు పెట్టాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4-0 తేడాతో విజయం సాధించాలి.

భారత జట్టులో మార్పులు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రెండోసారి ప్రసవించింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు..గిల్ ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా స్టార్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు.. అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. దీంతో పాత కొత్త సమ్మేళనంతో ఆ జట్టు కనిపిస్తోంది.. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి తేలారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదే

తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు పెర్త్ వేదికగా జరుగుతుంది.. ఇక్కడి ఓపస్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.

రెండవ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి 11 వరకు జరుగుతుంది. అడిలైడ్ వేదికగా ఈ టెస్ట్ డే అండ్ నైట్ నిర్వహిస్తారు.

మూడవ టెస్ట్ డిసెంబర్ 14 నుంచి 19 వరకు జరుగుతుంది. బ్రిస్బెన్ లోని గబ్బా మైదానంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.

నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు.. దీనిని బాక్సింగ్ డే టెస్ట్ అని పిలుస్తారు. మెల్బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఐదవ టెస్ట్ జనవరి 3 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.