IPL 2024: ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో చాలామంది ముందే చెన్నై లేదా ముంబై జట్లు టైటిల్ గెలుస్తాయని అంచనా వేశారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఈసారి చెన్నై జట్టు కచ్చితంగా కప్ ఎగరేసుకుపోతుందని ఘంటాపథంగా చెప్పారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు లెక్కలన్నీ మారిపోతున్నాయి. చెన్నై జట్టు మరీ ముంబై లాగా అధ్వానంగా ఆడటం లేదు గాని.. దాని ప్రదర్శన డిపెండింగ్ ఛాంపియన్ స్థాయిలో మాత్రం లేదు. ఈ సీజన్లో చాలామంది విశ్లేషకులు కోల్ కతా జట్టును పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆ జట్టు అద్భుతాలు చేస్తోంది. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి హ్యాట్రిక్ సాధించింది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బుధవారం రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 106 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో కోల్ కతా సాధించిందే భారీ గెలుపు.
అటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో కోల్ కతా జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది.. సునీల్ నరైన్, రింకు సింగ్, అండ్రీ రసెల్, వెంకటేష్ అయ్యర్ వంటి వారు కోల్ కతా జట్టుకు తిరుగులేని ఆరంభాన్ని ఇస్తున్నారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరు క్రీజ్ లో కుదురుకున్నారు అంటే చాలు కోల్ కతా తిరుగులేని విధంగా ఆడుతోంది. రస్సెల్, సునీల్ నరైన్, రింకు సింగ్ వంటి వారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు కోల్ కతా ఆడిన మూడు మ్యాచ్ ల్లో కూడా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనే చివరి వరకు పోరాడి విజయాన్ని సాధించింది.
కోల్ కతా జట్టులో బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మిచెల్ స్టార్క్ మొదటి రెండు మ్యాచ్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో సత్తా చూపించాడు. రెండు వికెట్లు పడగొట్టి టచ్ లోకి వచ్చాడు. అతడు తిరిగి ఫామ్ లోకి రావడం కోల్ కతా జట్టుకు తిరుగులేని బలం. అతడు మాత్రమే కాకుండా వైభవ్ అరోరా, హర్షిత్ రానా, రస్సెల్ వంటి వారితో కోల్ కతా బౌలింగ్ దళం బలంగా కనిపిస్తోంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయూస్ శర్మ వంటి వారు అవకాశం దొరికితే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయ గల సమర్థులు. కోల్ కతా రిజర్వ్ బెంచ్ కూడా బలంగా కనిపిస్తోంది. అనుకూల్ రాయ్, రెహమాన్ ఉల్లా, గుర్బాజ్, నితీష్ రానా, చేతన్ సకారియా, చమీరా, శ్రీకర్ భరత్, మనీష్ పాండే వంటి సమర్థులైన ఆటగాళ్లతో కోల్ కతా అలరారుతోంది. ఇలా ఎలా చూసుకున్నా కోల్ కతా జట్టు అరివీర భయంకరంగా కనిపిస్తోంది. ఈ ప్రకారం ఈ జట్టును ఓడించాలంటే మిగతా జట్లు చాలా బలాన్ని కూడతీసుకోవాలి.