https://oktelugu.com/

T20 World Cup 2024: గల్లా ఎగరేసి చెప్పొచ్చు..ఈ ఐదుగురుంటే.. టీ – 20 వరల్డ్ కప్ మనదేనని..

హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. బీభత్సమైన బ్యాటింగ్ తో అద్భుతాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 8, 2024 / 03:59 PM IST

    T20 World Cup 2024

    Follow us on

    T20 World Cup 2024: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా క్రికెట్ సందడి నెలకొంది. అభిమానులు సాయంత్రమైతే చాలు క్రికెట్ జపం చేస్తున్నారు. కుదిరితే టీవీలు.. వీలైతే ఫోన్ లో.. లైవ్ క్రికెట్ చూస్తూ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో కొంతమంది భారత ఆటగాళ్లు మైదానంలో సత్తా చాటుతున్నారు. అనితర సాధ్యమైన ఆటతీరుతో ఔరా అనిపిస్తున్నారు. కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్ల కంటే స్టేడియంలో వారు దుమ్మురేపుతున్నారు. టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. వీరిలో చాలామందికి త్వరలోనే టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ జాబితాలో కొంతమంది ఆటగాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ఆటగాళ్లలో ఈ ఐదుగురు కచ్చితంగా టీమిండియా ప్లేయర్ల జాబితాలో ఉంటారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..

    బిగ్ టార్గెట్

    ముంబై జుట్టు కెప్టెన్సీ పోయినప్పటికీ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు ఉన్న టార్గెట్ టీమిండియా టీ – 20 వరల్డ్ కప్ నెగ్గడం.. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో రోహిత్ శర్మ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే కచ్చితంగా టీ -20 వరల్డ్ కప్-24 ను సాధించాలని రోహిత్ శర్మ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎలాగైనా గెలవాలనే కసితో రోహిత్ ఉన్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా వంటి ఆటగాళ్లు కచ్చితంగా టీ -20 వరల్డ్ కప్ లో ఆడుతారు. టీ -20 అనేది వేగానికి అసలు సిసలైన కొలమానం కాబట్టి.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అనితర సాధ్యమైన తీరుగా ఆడుతున్న కొంతమంది యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తే కచ్చితంగా టీమిండియా కప్ దక్కించుకుంటుందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.

    ఆ ఐదుగురు వీరే..

    ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మ, మాయాంక్ యాదవ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబె. ప్రస్తుతం వీరు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వీరు జట్టులోకి వస్తే టీమిండియా ఆట తీరు పూర్తిగా మారిపోతుందని అంచనాలు ఉన్నాయి.

    అభిషేక్ శర్మ

    హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. బీభత్సమైన బ్యాటింగ్ తో అద్భుతాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇతడు గనుక టీమిండియాలోకి వస్తే తిరుగుండదు.. ఓపెనర్ గా రోహిత్ శర్మకు జత కూడితే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే.

    మయాంక్ యాదవ్

    మాయాంక్ యాదవ్ తన వేగవంతమైన బౌలింగ్ తో అద్భుతంగా బంతులు వేస్తున్నాడు. 156 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూనే.. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ను పాటిస్తున్నాడు. టీ -20 లో బుమ్రా కు మయాంక్ యాదవ్ తోడైతే ప్రత్యర్థి జట్టు వణికి పోవాల్సిందే.

    రింకూ సింగ్

    రింకూ సింగ్ ఇప్పటికే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని మ్యాచ్ లు కూడా ఆడాడు.. ప్రస్తుతం ఇతడి ఫామ్ చూసిన తర్వాత టీ -20 వరల్డ్ కప్ లో కచ్చితంగా ఉంటాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..

    రియాన్ పరాగ్

    కెరియర్ మొదట్లో ఓవర్ యాక్షన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రియాన్ పరాగ్.. ఈ సీజన్ లో అద్భుతాల మీద అద్భుతాలు చేస్తున్నాడు. సంచలన బ్యాటింగ్ తో ఆరెంజ్ క్యాప్ కోసం విరాట్ కోహ్లీ తోనే పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ వరుస విజయాలు సాధిస్తున్నదంటే దానికి ప్రధాన కారణం రియాన్ పరాగే. అద్భుతమైన బ్యాటింగ్ తో రాజస్థాన్ జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు. ఇతడు గనక టీమిండియాలోకి వస్తే టీ – 20 లో తిరుగుండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    శివమ్ దూబె

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్న ఈ ఆటగాడు..ఆల్ రౌండర్ గా ఎదిగాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. చెన్నై జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ.. ఆ జట్టు సాధించే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

    ఈ ఐదుగురు ఆటగాళ్లకు టీ 20 వరల్డ్ కప్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా టీం ఇండియాకు ఎదురుండదని క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేగానికి అసలు సిసలైన కొలమానంగా ఉండే టీ -20 వరల్డ్ కప్ లో యువ రక్తానికి చోటు కల్పిస్తే కచ్చితంగా టీమిండియా కప్ సాధిస్తుందని మాజీ క్రీడాకారులు సైతం అభిప్రాయపడుతున్నారు.