T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జూన్ రెండు నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 29 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగుతుంది. అప్పట్లో ధోని నాయకత్వంలో భారత్ t20 వరల్డ్ కప్ దక్కించుకుంది. గత 11 సంవత్సరాలుగా వరల్డ్ కప్ కోసం నిరీక్షిస్తోంది. ఈ క్రమంలో ఈసారి కప్ దక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాకు టి20 వరల్డ్ కప్ అందించి, రిటైర్మెంట్ ప్రకటించాలని రోహిత్ శర్మ యోచిస్తున్నాడు.
టి20 వరల్డ్ కప్ ఆడే జట్టుకు సంబంధించి 15 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇటీవల వారి వివరాలను ప్రకటించింది. ఐపీఎల్ లీగ్ సమరం ముగియగానే.. టి20 వరల్డ్ కప్ శిక్షణ శిబిరాన్ని బీసీసీఐ ప్రారంభిస్తుంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఈ శిబిరం కొనసాగుతుంది.. ఈ క్రమంలో 15 మందితో కూడిన జట్టులో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు అత్యంత కీలకంగా మారారు. ఇంతకీ వారు ఎవరంటే..
యశస్వి జైస్వాల్
ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు.. టి20లలో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. దూకుడైన ఆట తీరును ప్రదర్శిస్తూ భారత సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. అంతేకాదు మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇతడిని ఓపెనింగ్ జోడీగా పంపించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను ప్రదర్శిస్తే టీమిండియా కు తిరిగి ఉండదు. భారత్ ప్రత్యర్థి జట్టు ఎదుట భారీ టార్గెట్ ఉంచాలంటే యశస్వి జైస్వాల్ కచ్చితంగా రాణించాలి. దూకుడు మంత్రాన్ని ఎంచుకోవాలి.
రిషబ్ పంత్
పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై.. రెండు సంవత్సరాలపాటు ఆటకు దూరమయ్యాడు. రీ ఎంట్రీ తో దుమ్ము దులుపుతున్నాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తూ.. తన అసలు సిసలైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే సామర్థ్యం పంత్ సొంతం. గతంలో ఆడినట్టుగా.. టి20 వరల్డ్ కప్ లో కూడా ఆడితే ఇక భారత జట్టుకు తిరుగు ఉండదు. అన్నట్టు కీపింగ్ లో కూడా పంత్ అదరగొడతాడు .
హార్దిక్ పాండ్యా
టీమిండియా కు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ సమర్థవంతంగా చేయగలడు. ముంబై జట్టును సరైన దిశలో నడిపించలేకపోయినప్పటికీ.. ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే గుజరాత్ జట్టుకు కప్ అందించాడు. గత ఏడాది రన్నరప్ గా నిలిచేలా చేశాడు. అయితే ముంబై జట్టు అతని నాయకత్వంలో విఫల ప్రదర్శన కొనసాగించడంతో హార్దిక్ పాండ్యా పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే హార్దిక్ గతంలో లాగా నిలకడగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తే టీమిండియా కు తిరుగు ఉండదు. అంతే కాదు మిడిల్ ఆర్డర్ కూడా బలోపేతం అవుతుంది. హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 92 టి20 మ్యాచ్ లు ఆడాడు. 1,348 రన్స్ చేశాడు. 73 వికెట్లు పడగొట్టాడు. తన దూకుడు మంత్రాన్ని కొనసాగిస్తే మాత్రం ప్రత్యర్థి జట్లకు చుక్కలే.