SRH Vs RR Qualifier 2: ప్లే ఆఫ్ తొలి మ్యాచ్ లో కోల్ కతా జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో హైదరాబాదు ఓడిపోయింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం హైదారాబాద్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఆడాల్సి ఉంది. ఈ ప్రకారం ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు పై గెలిచిన రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ తలపడనుంది. శుక్రవారం చెన్నై వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్టును ఢీకొట్టనుంది.. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు, గత రెండు రోజులుగా ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తమిళనాడు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవుతుందని అందరూ భావించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. దాని ప్రకారం శనివారం నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఆరోజు కూడా కుదరకపోతే మ్యాచ్ రద్దు చేస్తారు.
ఇలా మ్యాచ్ రద్దు చేస్తే అది హైదరాబాద్ జట్టుకే ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే ముందు వరసలో ఉంది. నిబంధనల ప్రకారం మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే.. పాయింట్ల పట్టికలో ముందు స్థానంలో ఉన్న జట్టుకు లాభం జరుగుతుంది. ఆ ప్రకారం క్వాలిఫైయర్ -2 మ్యాచ్ నిర్వహణకు అడ్డంకులు ఏర్పడితే.. రాజస్థాన్ కంటే పాయింట్లు, రన్ రేట్ విషయంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది కాబట్టి.. ఆ జట్టుకే ఫైనల్ వెళ్లే అవకాశాలుంటాయి. కానీ చెన్నైలో శుక్రవారం వాతావరణం పొడిగా మారింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలన్నీ గాలి మాటలనే తలపించాయి. శుక్రవారం వాతావరణం అక్కడ పొడిగా మారింది. భరించలేని ఉక్క పోత అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉక్కపోత వల్ల ఆటగాళ్లు కూడా సరిగా ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఎండ కూడా విపరీతంగా ఉండటంతో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది.
అక్కడి వాతావరణం ప్రకారం రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మైదానంలో గత రికార్డులను పరిశీలిస్తే.. ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు జరిగితే.. ఐదుసార్లు చేజింగ్ చేసిన జట్టే విజయాన్ని అందుకుంది. ఈ మైదానంలో హైదరాబాద్ జట్టుకు ఆశించినంత స్థాయిలో రికార్డు లేదు. పైగా గత మ్యాచ్ లో టాస్ నెగ్గిన హైదరాబాద్ జట్టు కోల్ కతా బౌలర్ల ముందు తేలిపోయింది. తక్కువ స్కోర్ చేసి.. 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఒకవేళ టాస్ గెలిస్తే కచ్చితంగా ఫీల్డింగ్ తీసుకొనే అవకాశం ఉంది. స్థూలంగా చెప్పాలంటే టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.