Odi World Cup 2023 Schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ పై అభ్యంతరాలను కూడా ఐసీసీ ఆయా దేశాల నుంచి తీసుకుంది. అభ్యంతరాలను ఐసీసీ నివృత్తి చేయడంతో షెడ్యూల్ ప్రకటన మిగిలి ఉంది. దీనికి సంబంధించి కూడా ఐసీసీ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
భారత దేశంలో వన్డే వరల్డ్ కప్ ఏడాది అక్టోబర్ నుంచి జరగనుంది. ఏ జట్లు, ఏ ఏ వేదికల్లో ఆడనున్నాయి అన్న దానికి సంబంధించి షెడ్యూల్ ను భారత జట్టు సిద్ధం చేసి ఐసీసీకి అందించింది. ఐసీసీ నుంచి ఈ షెడ్యూల్ విడుదలకు సంబంధించి ఓకే చెప్పడంతో ప్రకటన విడుదల కానుంది. ఈ ప్రకటన వన్డే వరల్డ్ కప్ జరిగే తేదీకి సరిగ్గా 100 రోజులు ముందే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 27న షెడ్యూల్ విడుదల చేయనున్న ఐసీసీ..
భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఈనెల 27వ తేదీన ప్రకటించేందుకు ఐసిసి సిద్ధమవుతోంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అంటే షెడ్యూల్ విడుదల చేసే సమయానికి సరిగ్గా 100 రోజుల సమయం ఉంటుంది. బీసీసీఐ, పీసీబీల మధ్య ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజుల నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్ ఐసీసీ కి అందించిన షెడ్యూల్ పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తుంది. పాక్ యాజమాన్యం ఈ షెడ్యూల్ పై స్పష్టతను ఇవ్వకపోవడంతో జాప్యం జరిగింది. ఐసీసీ పంపించిన ముసాయిదా షెడ్యూల్ కు ఎప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలపలేదు. అయితే ఈ ముసాయిదా షెడ్యూల్ కు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని పిసిబి చెబుతూ వస్తోంది. దీంతో ఆలస్యం జరిగింది.
వేచి చూసి ప్రకటించే అవకాశం..
పాకిస్తాన్ బోర్డు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించే మ్యాచ్ పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో రెండు క్రికెట్ బోర్డుల యాజమాన్యాల మధ్య అవగాహన కుదరకపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. పిసిబి ఈ వ్యవహారంపై ఆ దేశ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి సానుకూల సిగ్నల్ రాకపోవడంతో పిసిబి కూడా దీనిపై ఐసీసీకి తమ నిర్ణయాన్ని చెప్పలేకపోతోంది. అయితే పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ నిర్వహించాలన్న ప్రతిపాదనను పెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే భారత్ దీనికి అంగీకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజులపాటు వేచి చూసి షెడ్యూల్ ప్రకటించేందుకు ఐసిసి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పిసిబి దానికి ఆమోదం తెలుపుతుందా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది.