IND VS NZ Test series : 2000 సంవత్సరం నుంచి స్వదేశంలో వైట్ వాష్ కు గురికాని జట్టుగా టీమిండియా కు పేరుంది. అయితే అలాంటి జట్టు అంతంతమాత్రంగా ఉన్న న్యూజిలాండ్ పై ఓడిపోయింది. మూడు టెస్టులలో దారుణమైన ఆట పేరు ప్రదర్శించి ఓటమిపాలైంది. స్వదేశంలో పరువు తీసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ముందు విమర్శల పాలైంది. న్యూజిలాండ్ సిరీస్ కు ముందు టీమిండియా కీర్తి హిమాలయాలంతఎత్తున ఉండేది. కానీ ఒక్కసారిగా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో పాతాళంలోకి పడిపోయింది. అయితే ఈ ఓటమిని రకరకాలుగా విశ్లేషించినప్పటికీ.. జాతీయ మీడియా మాత్రం సంచలన కథనాలను ప్రసారం చేస్తోంది. ఆ కథనాలను ఒకసారి పరిశీలిస్తే..
మెడలు వంచింది..
ప్రపంచ విజేతలమని ఆస్ట్రేలియా ఒకప్పుడు విర్రవీగింది. అలాంటి జట్టు మనదేశంలో పర్యటించినప్పుడు.. మన ఆటగాళ్లు ఆస్ట్రేలియాను ఓడించి గర్వభంగం చేశారు..బజ్ బాల్ ఆటను పరిచయం చేసిన ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. అలాంటి మైదానాలపై భారత్ తడబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు స్పిన్ ఆడటంలో కూడా జట్టు ఆటగాళ్లు ఇబ్బంది పడిపోతున్నారు. స్పిన్ బౌలర్ల పై పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయించే భారత ఆటగాళ్లు తల వంచుతున్నారు. అంతర్జాతీయంగా ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రత్యర్థి ఆటగాళ్లను స్పిన్ ఉచ్చులో బంధించడంలో భారత బౌలర్లు నేర్పరులు. అయితే అలాంటి ఆటగాళ్లు కివీస్ సిరీస్లో తేలిపోయారు. స్పిన్ మైదానాన్ని రూపొందించడం భారత జట్టుకు ప్రతిబంధకంగా మారిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించింది. ఆ సమయంలో స్పిన్ బౌలర్లను యశస్వి జైస్వాల్, గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారి సగటు 39.8 గా నమోదయింది. బంగ్లాదేశ్ సిరీస్లో ఆ సగటు కాస్త 42.9 కు పెరిగిపోయింది. న్యూజిలాండ్ జట్టు విషయానికి వచ్చేసరికి అది 24.4 కు పడిపోయింది.
పూర్తిగా విఫలమయ్యారు
వాస్తవానికి న్యూజిలాండ్ సిరీస్ లో భారత బ్యాటర్ల సగటు 21.55 గా నమోదయింది. ఈ ప్రకారం చూసుకుంటే టర్నింగ్ ట్రాక్ పై భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.. ఇక రవీంద్ర జడేజా, అశ్విన్ లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. వారిని రచిన్ రవీంద్ర, యంగ్, మిచెల్ వంటి వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు.. రోహిత్ లాంటి ఆటగాడు సాంట్నర్ బౌలింగ్లో ఆడ లేక చాలా ఇబ్బంది పడ్డాడు. సాంట్నర్ 13 వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ 11, ఫిలిప్స్ 7 వికెట్లు పడగొట్టారు. మూడు టెస్టులలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్లు 37 వికెట్లు సాధించారు.. ఈ గణాంకాలు చూస్తే స్వదేశీ మైదానాలపై స్పిన్ బౌలర్లు పట్టు కోల్పోయారని తెలుస్తోంది. ఇకనైనా బిసిసిఐ స్పిన్ ట్రాక్ కు వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉందని జాతీయ మీడియా తన కథనాలలో ప్రస్తావిస్తోంది. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు.