https://oktelugu.com/

Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ ముందు.. పాక్ కు బీసీసీఐ మరో షాక్.. ఇక టోర్నీ జరగడం కష్టమే..

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పాకిస్తాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ ట్రోఫీకి సంబంధించి ఆతిధ్య హక్కులను కోల్పోయే ప్రమాదంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పడింది. దీంతో దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారత్ లోనే ఆ టోర్నీ జరుపుతారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 15, 2024 / 09:24 PM IST

    Champions Trophy 2025

    Follow us on

    Champions Trophy 2025 :  ఇవి ఇలా ఉండగానే పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్ ట్రోఫీ టూర్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సందర్శనకు ఉంచాలనుకుని భావించింది. అయితే ఆ జట్టు బోర్డుకు ఐసిసి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.” ఛాంపియన్స్ ట్రోఫీ అనేది క్రికెట్ ను మరింత విస్తృతం చేయడానికి నిర్వహిస్తున్నాం. అలాంటి ట్రోఫీని వివాదాస్పద ప్రాంతాలకు ప్రదర్శించకూడదు. దానికి అనుమతి కూడా లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని” ఐసీసీ ప్రకటించిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో భాగంగా నవంబర్ 14న ఈ కప్ ను పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ అందజేసింది..

    ఆ మరుసటి రోజు..

    నవంబర్ 14న ఐసీసీ నుంచి ట్రోఫీ ఇస్లామాబాద్ కు వచ్చింది. ఆ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నవంబర్ 16 నుంచి 24 వరకు దేశం మొత్తం ప్రదర్శించాలని భావించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ ఆనందం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఒక్క రోజు కూడా లేకుండా పోయింది. ట్రోఫీ ఇచ్చిన మరుసటిరోజే ఆ టూర్ రద్దు చేస్తూ ఐసీసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

    దాని వెనక ఏం జరిగిందంటే..

    ఐసీసీ నుంచి ట్రోఫీ రాగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికలో సంచలన ప్రకటన చేసింది. ” పాకిస్తాన్ ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఈనెల 16 నుంచి ఇస్లామాబాద్ లో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ కు రంగం సిద్ధమవుతోంది. ఆ తర్వాత టూరిస్ట్ ప్లేస్ లైన స్కర్దు, ముర్రీ, హుంజా, ముజఫర్బాద్ ప్రాంతాలలో ట్రోఫీని ప్రదర్శిస్తాం.. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఓవల్ మైదానంలో పాకిస్తాన్ జట్టు ట్రోఫీని అందుకున్నది. ఆ ట్రోఫీని కూడా మీకు చూసే అదృష్టాన్ని కల్పిస్తాం. దానిని చూసి గర్వపడండి. కనులారా వీక్షించి ఆనందపడండి” అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నది.

    బీసీసీఐ అభ్యంతరం అందుకే..

    స్కర్దు, ముర్రీ, హుంజా, ముజఫర్బాద్ ప్రాంతాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా ఉన్నాయి. వీటిల్లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శించడానికి వీల్లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. “పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టి పరిస్థితుల్లో పిఓకే లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శించకూడదని” బీసీసీఐ ఐసీసీకి స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ని ప్రదర్శించకూడదని పీసీబీకి ఐసీసీ సూచించింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఒక్కసారిగా షాక్ తగిలింది. బీసీసీఐ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు దిమ్మతిరిగింది. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.