INDIA vs USA : వారెవ్వా సిరాజ్.. క్యాచ్ పట్టేందుకు స్పైడర్ మాన్ అవతారం.. బిత్తర పోయిన అమెరికన్ బ్యాటర్

INDIA vs USA ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో అమెరికన్ ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. శివం దూబే ఒక ఓవర్ వేసి, 11 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

Written By: NARESH, Updated On : June 12, 2024 10:45 pm

Mohammad Siraj

Follow us on

INDIA vs USA : టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు అమెరికాతో తలపడుతోంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు అమెరికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. రోహిత్ శర్మ నిర్ణయం సరైనదని చాటి చెబుతూ, భారత బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేశారు.. అర్ష్ దీప్ సింగ్ సత్తా చాటాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి.. అమెరికా టాప్ ఆర్డర్ ను వణికించాడు. ఫలితంగా అమెరికా ఎనిమిది వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

అమెరికా పరుగుల ఖాతా ప్రారంభించక ముందే తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన అర్ష్ దీప్ సింగ్ తొలి బంతికే జహంగీర్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతికి గౌస్(2) ను ఔట్ చేసి అమెరికా జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఈ దశలో స్టీవెన్ టేలర్(24; 30 బంతుల్లో రెండు సిక్సర్లు), జోన్స్(11) అమెరికా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. ఈ దశలో జోన్స్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. అండర్సన్ (14: 12 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) కాసేపు సహకారం అందించినప్పటికీ.. అతడు హార్థిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హర్మిత్ సింగ్ (11) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. అప్పటికే ఓవర్లు కరిగిపోవడం.. నితీష్ కుమార్ (27) అవుట్ కావడంతో.. అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

స్లో పిచ్ పై భారత బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్ 4-9 తన కెరియర్లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. పాండ్యా 2-14 తో సత్తా చాటాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.. బుమ్రా, సిరాజ్, శివం దూబే వంటి వారు ఆశించినంత స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో అమెరికన్ ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. శివం దూబే ఒక ఓవర్ వేసి, 11 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

అమెరికా ఇన్నింగ్స్ సమయంలో భారత జట్టు రెండు ఘనతలు సాధించింది. ఒకటి ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి, తన కెరియర్లో అద్భుతమైన గణాంకాలను భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ నమోదు చేశాడు. తర్వాత నితీష్ కుమార్ క్యాచ్ పట్టి సిరాజ్ వారెవ్వా అనిపించాడు. అమెరికా ఇన్నింగ్స్ 14.4 ఓవర్లో అర్ష్ దీప్ సింగ్ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ ను నితీష్ కుమార్ లాంగ్ ఆన్ లోకి ఆడాడు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద సిరాజ్ కాచుకుని ఉన్నాడు. అమాంతం వచ్చిన బంతిని స్పైడర్ మాన్ లాగా ఎత్తుకు ఎగిరి అందుకున్నాడు. ఒంటి చేత్తో క్యాచ్ పట్టి ఆకట్టుకున్నాడు. అలా క్యాచ్ పట్టడంతో అమెరికా ఆటగాడు నితీష్ బిత్తర పోయాడు. నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు. అద్భుతమైన క్యాచ్ పట్టిన సిరాజ్ ను కామెంటేటర్లు అభినందనలతో ముంచెత్తారు.