Wriddhiman Saha : క్రీడల్లో అవకాశాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. అవకాశం రావడమే తరువాయి ఆటగాళ్లు ఎగిరి గంతేస్తారు. ఎప్పుడు అవకాశం వస్తుందా..? జట్టులో కీలకంగా మారదామా..? అని చాలామంది ఎదురు చూస్తుంటారు. భారతదేశంలో, మరీ ముఖ్యంగా క్రికెట్ లో అయితే వివిధ స్థాయిల్లో నిర్వహించే క్రికెట్ పోటీలకు ఎంపికయ్యే జట్టులో సభ్యులుగా ఉండేందుకు పోటీ తీవ్రంగా ఉంటుంది. అటువంటి పోటీలో అవకాశం రావడమే గొప్ప. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకొని జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు ఒక సీనియర్ క్రికెటర్. తనకు వచ్చిన అవకాశాన్ని కాదని.. జూనియర్ల కోసం తన స్థానాన్ని త్యాగం చేశాడు. ఆ ఆటగాడు ఎవరు? ఆ కథ ఏంటో మీరు చదివేయండి.
భారత క్రికెట్ జట్టుకు ఆడి, ప్రస్తుతం ఐపీఎల్ వంటి లీగ్ ల్లో అదరగొడుతున్నాడు వెటరన్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహ. ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టాడు సాహా. ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రతిష్టాత్మక దేశవాళీ దులీప్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈస్ట్ జోన్ జట్టులో వికెట్ కీపర్ గా వృద్ధిమాన్
సాహాకే అవకాశం లభించింది. అయితే, ఈ అవకాశాన్ని సాహా సున్నితంగా తిరస్కరించి యువకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని త్రిపుర సెలెక్టర్ జయంత్ దే స్వయంగా చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
యువ ఆటగాళ్ల కోసమే అవకాశాన్ని వదులుకున్న సాహ..
భారత క్రికెట్ జట్టులోకి రావాలనుకునే యువ ఆటగాళ్ల కోసం నిర్వహించేదే దులీప్ ట్రోఫీ. అటువంటి ట్రోఫీలో యువకులకు అవకాశం కల్పించడం మంచిదన్న ఉద్దేశంతోనే సాహా తనకు వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నాడు. ఇందులో ఆడడం వల్ల తనకు ఇప్పుడు కలిగే మేలు ఏమీ ఉండదని, అదే మరో యువకుడికి అవకాశం కల్పించడం వల్ల భారత జట్టుకు ఆడే అవకాశం దక్కుతుందని సాహా బావించినట్లు జయంత్ దే చెప్పుకొచ్చాడు. సాహా చెప్పిన మాటలు తమను ఎంతగానో ఆలోచింపజేశాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. మొదట వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను తీసుకోవడానికి ఈస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపినప్పటికీ, అతడు ఆడేందుకు ఆసక్తిగా లేనని చెప్పడంతో సెలెక్టర్లు డైలామాలో పడినట్లు దే వివరించాడు. దీంతో వృద్ధి మాన్ సాహాను సంప్రదించగా అతడు సున్నితంగా తిరస్కరించిన విధానాన్ని జయంత్ చెప్పుకొచ్చాడు.
అందరికీ ఆదర్శంగా నిలవనున్న సాహ..
వృద్ధిమాన్ సాహ చేసిన ఈ పనికి పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుత భారత క్రికెట్ లో నిజాయితీ కలిగిన ఆటగాడిగా పలువురు పేర్కొంటున్నారు. సాహ చెప్పిన మాటలు తమను ఆలోచింపజేశాయని జయంత్ దే స్వయంగా వివరించాడు. భారత జట్టులోకి రావాలనుకునే వారి కోసం నిర్వహించే ట్రోఫీలో ఇప్పటికే ఆడి, ఆడుతున్న ఆటగాళ్లను ఎంపిక చేయడం వల్ల ఉపయోగం లేదన్న విషయాన్ని తాము గ్రహించినట్లు జయంత్ దే వివరించాడు. యువకులకు అవకాశం కల్పించడం ద్వారా అతనిలోని ప్రతిభను బయటకు తీసేందుకు అవకాశం ఉంటుందన్న సాహా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన మరోసారి తెలియజేశాడు. ఇకపోతే ఈస్ట్ జోన్ టీమ్ కు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, అతనికి డిప్యూటీగా షహబాజ్ నదీమ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. సౌత్ జోన్ జట్టుకు హనుమ విహారి సారథ్యం వహించనుండగా.. ఈ జట్టులో కె ఎస్ భరత్ వికెట్ కీపర్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
ఇది ఈస్ట్ జోన్ జట్టు..
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సంతాను మిశ్రా, సుదీప్ ఘరామి, రియన్ పరాగ్, ఏ మజుందార్, బిపిన్ సౌరబ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), షహబాజ్ నదీమ్ (వికెట్ కీపర్), కే కుషగ్రా (వికెట్ కీపర్), షహబాజ్ అహ్మద్, ముకేష్ కుమార్, ఆకాష్ దీప్, అనుకుల్ రాయ్, మురా సింగ్, ఇషాన్ పొరెల్.