Vijay Deverakonda Cricket League Issue: ఇటీవల వివాహం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. పైగా తన సొంత జిల్లాలో విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందజేశాడు. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. విజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో పెద్దపెద్ద ప్రాజెక్టులున్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం టీజీ టీ20 టోర్నీకి ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు. ఇతడితోపాటు దగ్గుబాటి వెంకటేష్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మ టీజీ టి20 టోర్నీలో కీలకంగా ఉన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టిజి టి 20 టోర్నీ నిర్వహిస్తోంది. ఇటీవల వేలం కూడా జరిగింది. మరికొద్ది రోజుల్లో టోర్నీ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీజీ టి20 టోర్నమెంట్కు ఎటువంటి అనుమతి లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తాజాగా బాంబు పేల్చింది. అంతేకాదు టీజీ టి20 టోర్నీకి ఎండార్స్మెంట్ చేసుకోవడానికంటే ముందు.. దానికి అనుమతి ఉందో లేదో చూసుకోవాలని టిసిఏ జనరల్ సెక్రెటరీ వ్యాఖ్యానించడం సంచలనానికి కారణమవుతోంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే
టోర్నమెంట్ ప్రకటించడానికి 45 రోజుల ముందు బీసీసీఐ నుంచి అనుమతులు తీసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తు కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగితే క్రిమినల్ కేసులు నమోదు అవుతుంటాయి. అనుమతి లేని టోర్నీలలో తిలక్.. సిరాజు వంటి ప్లేయర్లకు ఆడాలని బీసీసీఐ అనుమతులు ఇచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండార్స్మెంట్ చేసుకునే ముందు ఈ టోర్నీ న్యాయబద్ధంగా జరుగుతోందా.. అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. మరోవైపు ఖమ్మం టీం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడికి సంబంధం గురించి కూడా సరికొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
వరంగల్ జట్టులో జూపల్లి కృష్ణారావు కొడుకు వ్యవహారం గురించి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సరికొత్త ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీజీ టి20 టోర్నీ ఫ్రాడ్ అని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫీజులకే ఐదు నుంచి 6 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని మండిపడుతోంది. ఈ డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో క్రికెట్ ను అభివృద్ధి చేయవచ్చని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు చెబుతున్నారు. ఈ నోటీసుల నేపథ్యంలో విజయ్ దేవరకొండ నుంచి మొదలుపెడితే రాయుడు వరకు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
