Telugu Titans Vs Tamil Thalaivas: సీజన్ మారింది. ప్లేయర్లు కూడా మారారు. కానీ తెలుగు టైటాన్స్ అదృష్టం మాత్రం మారలేదు. దురదృష్టం వెంటాడుతోంది. సీజన్లకు సీజన్లు దరిద్రం నెత్తిమీద తాండవం చేస్తోంది. సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. పట్టిష్టమైన మేనేజ్మెంట్ ఉన్నప్పటికీ.. ఎక్కడో తేడా కొడుతోంది. మొత్తానికి అది జట్టు ఆట తీరును సర్వనాశనం చేస్తున్నది. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ దాకా వచ్చింది. ఆల్రెడీ సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్లోనైనా తెలుగు టైటాన్స్ అదరగొడతారని.. అదిరిపోయే రేంజ్ లో తమ సామర్థ్యాన్ని చూపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులవుతున్నాయి. పెంచుకున్న నమ్మకం గాలిలో కలిసిపోతుంది.
Also Read: ట్రంప్ ఇండియాతో పెట్టుకుంటున్నావ్?
తెలుగు , తమిళ్ జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది.. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు నువ్వా నేనానట్టుగా సాగింది. అయితే చివర్లో తెలుగు టైటాన్స్ తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో.. మ్యాచ్ ఫలితం తారు మారయింది. చివరి 20 సెకండ్లలో తమిళ్ తలైవాస్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.. ఒకానొక దశలో తెలుగు టైటాన్స్ 34, తమిళ్ తలైవాస్ 35 స్కోర్ తో ఉన్నాయి. చివర్లో గనక తెలుగు టైటాన్స్ కాస్త తెలివిని ప్రదర్శిస్తే మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ తెలుగు టైటాన్స్ చివర్లో సత్తా చూపించలేకపోయింది. సాహసోపేతమైన ఫలితం కోసం ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తమిళ జట్టు 38 పాయింట్లు సాధించింది.. మొత్తంగా మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది..
గడిచిన సీజన్లలో కూడా తెలుగు టైటాన్స్ ఇదే తీరైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో విజయాలను టోర్నీ చివరి వరకు కొనసాగించలేకపోయింది. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలుగు టైటాన్స్ విజయాన్ని అందుకోలేక పోతోంది.. ఇక శనివారం యూపీ యోదాస్ తో తెలుగు టైటాన్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో కనుక సానుకూల ఫలితం వస్తేనే తెలుగు జట్టు సీజన్లో గాడిలో పడుతుంది. పైగా ఈ మ్యాచ్ తెలుగు జట్టుకు అత్యంత ముఖ్యమైనది.. రైడింగ్ విషయంలో ఇబ్బంది లేక పోయినప్పటికీ.. డిఫెన్స్ వచ్చేసరికి తెలుగు జట్టు పూర్తిగా తడబడుతోంది. దానినే మిగతా జట్లు క్యాచ్ చేసుకుంటున్నాయి. ఈ సీజన్లో కూడా తెలుగు జట్టు తన ఆట తీరు మార్చుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి..