India Vs England Semi Final 2024: పదేళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా.. క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

గయానా వేదికగా గురువారం డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 68 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. టైటిల్ కోసం శనివారం దక్షిణాఫ్రికా తో జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 12:05 pm

India Vs England Semi Final 2024

Follow us on

India Vs England Semi Final 2024: 2007లో టి20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా.. ఆ తర్వాత మరోసారి కప్ సాధించలేకపోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్, ఒకసారి ఫైనల్ చేరినప్పటికీ కప్ దక్కించుకోలేకపోయింది. గత టి20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లోనూ పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇన్ని ఓటముల నేపథ్యంలో.. ఈసారి కప్ సాధించడమే లక్ష్యంగా టీమిండియా టి20 వరల్డ్ కప్ టోర్నీలోకి అడుగు పెట్టింది. ఐర్లాండ్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ తో సెమీస్ మ్యాచ్ వరకు.. వరుస విజయాలనందుకుంది.

ముఖ్యంగా గయానా వేదికగా గురువారం డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 68 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. టైటిల్ కోసం శనివారం దక్షిణాఫ్రికా తో జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 171 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57), సూర్య కుమార్ యాదవ్ (47) దూకుడుగా బ్యాటింగ్ చేశారు.. హార్దిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (17) పరుగులతో సత్తా చాటారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. బ్రూక్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ విజయం ద్వారా భారత జట్టు అనేక రికార్డులను సొంతం చేసుకుంది. 2014లో జరిగిన టి20 వరల్డ్ కప్ అనంతరం నాకౌట్ మ్యాచ్ లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. 2014 t20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక తన లక్ష్యాన్ని కాపాడుకొని తుది పోరుకు అర్హత సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ జట్టుపై 27 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. అప్పటి నుంచి టి20 వరల్డ్ కప్ లో నాకౌట్ గేమ్స్ లో ఏ జట్టు కూడా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. టి20 ప్రపంచ కప్ చరిత్రలో 12సార్లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని విజయాన్ని సాధించింది.

టి20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లలో(ఫైనల్, సెమీఫైనల్స్) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొన్న జట్టు ఓడిపోవడం ఇది రెండవసారి. 2009లో వెస్టిండీస్ ఇలానే ఓటమిపాలైంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ పరాజయాన్ని చదివి చూసింది. ఇక టీ – 20 వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ పోటీలో పరుగులపరంగా ఇది రెండో భారీ విజయం. ఈ విజయాల జాబితాలో టాప్ స్థానంలో వెస్టిండీస్ కొనసాగుతోంది. 2012లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2024లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2009లో వెస్టిండీస్ జట్టుపై శ్రీలంక 57 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.