India Vs Pakistan Asia Cup 2025 Final: బలమైన బ్యాటింగ్.. విభిన్నమైన బౌలింగ్.. అద్భుతమైన ఫీల్డింగ్ .. ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీం ఇండియా గురించి మీడియాలో హోరెత్తిపోయిన విశ్లేషణలు అవి. నిజానికి ఆసియా కప్‌లో టీమ్ ఇండియాను మించిన జట్లు లేవు. కనీసం బలమైన ప్రతిఘటన కూడా ఇచ్చే జట్లూ లేవు.. అందువల్లే ఆసియా కప్ టీమ్ ఇండియాకు నల్లేరు మీద నడక అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవంలో అలా ఉండడం లేదు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లలో విచిత్రమైన పరిస్థితి ఎదురయింది. ఎందుకంటే టీమిండియాలో ఉన్న లోపాలు బయటపడ్డాయి.. ఫైనల్ వెళ్లిపోయిన నేపథ్యంలో.. పాకిస్తాన్ జట్టుతో అమీ తుమీ తేల్చుకోవాల్సిన సందర్భంలో మూడు లోపాలు ప్రధానంగా టీమ్ ఇండియాను ఇబ్బంది పెడుతున్నాయి.
సూర్య కుమార్ యాదవ్
సూర్య కుమార్ యాదవ్ ఆసియా కప్ లో ఆకట్టుకోవడం లేదు. లీగ్ దశలో పాకిస్తాన్ జట్టుపై అతడు చేసిన 47 పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద అతడు తేలిపోయాడు. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద మాత్రం అతడు తేలిపోయాడు. అతడికి ఎలా వేస్తే అవుట్ అవుతాడో.. ప్రత్యర్థి బౌలర్లకు అర్థమైంది. దీంతో వారు ఆ దిశలో బంతులు వేసి అతడిని వెనక్కి పంపించారు. పాకిస్తాన్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ తన బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవాల్సి ఉంది.
ఫీల్డింగ్ లోపం
భారత గట్టును ప్రధానంగా ఇబ్బంది పెడుతోంది ఫీలింగ్ లోపం. ఈ సిరీస్ లో భారత ఫీల్డర్లు ఇప్పటివరకు 12 క్యాచ్‌లను వదిలేశారు. ఈ జాబితాలో భారత్ కంటే హాంకాంగ్(11), బంగ్లాదేశ్ (8) మెరుగ్గా ఉన్నాయంటే భారత్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ వైఫల్యాన్ని పూర్తిగా మార్చుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగిస్తే భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ పోస్ట్ ఊస్ట్ కావచ్చు.
మిడిల్ ఆర్డర్
ఇప్పటివరకు టీం ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు దూకుడుగా ఆడటం వల్ల మిగతా ప్లేయర్ల మీద పెద్దగా ఒత్తిడి పడటం లేదు. అలాంటి సానుకూల అంశాన్ని కూడా మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు వినియోగించుకోవడం లేదు. మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే వంటి వారు నిలకడగా ఆడలేక పోతున్నారు. స్థిరత్వాన్ని కోల్పోయి జట్టును ఇబ్బందుల్లో పెడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ ముందు ఈ లోపాన్ని టీమిండియా కచ్చితంగా సవరించుకోవాలి. శ్రీలంక జట్టుతో జరిగే చివరి మ్యాచ్‌లో భారత్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు కచ్చితంగా రాణించాలి. ఒకరకంగా దీనిని సన్నాహక మ్యాచ్ లాగా భావించాలి. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు పాకిస్తాన్ పై ఒక సిరీస్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలుస్తుంది.