Gautham Gambhir : రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమ్ ఇండియాకు కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ను భారత్ గెలిచినప్పుడు.. జట్టులో గౌతమ్ గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. పైగా ఆ రెండు టొర్నీల ఫైనల్ మ్యాచ్లలో గౌతమ్ గంభీర్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. కొంతకాలానికి టీమ్ ఇండియా కు గుడ్ బై చెప్పాడు.
ఐపీఎల్ లో అద్భుతాలు
ఎడమచేతి వాటం గల గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో ఎన్నో అద్భుతాలు చేశాడు..కోల్ కతా జట్టు కు కెప్టెన్ గా అనితర సాధ్యమైన విజయాలు అందించాడు. 2012, 2014 సీజన్లలో కోల్ కతా జట్టు కు ట్రోఫీలు అందించాడు. అంతేకాదు 2024లో మెంటార్ గా మారి కోల్ కతా జట్టును మరోసారి విజేతగా నిలిపాడు. దాదాపు పది సంవత్సరాల తర్వాత కోల్ కతా జట్టుకు కప్ కరువు తీర్చాడు. ఐపీఎల్ లో కోల్ కతా జట్టును నడిపించిన తీరును చూసి ముచ్చటపడిన బిసిసిఐ సెక్రెటరీ జై షా గౌతమ్ గంభీర్ తో మంతనాలు జరిపాడు. అవి ఒక కొలిక్కి రావడంతో టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకానికి మార్గం సుగమం అయింది. జూలై 9న రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ వస్తున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ట్విట్టర్ లో వీడియో
గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టును విడిచిపెట్టి టీమిండియా కోచ్ గా నియమితుడైనప్పటికీ.. అతడి మనసు కేకేఆర్ జట్టు చుట్టే తిరుగుతోంది. ఈ క్రమంలో కోల్ కతా జట్టుతో తనకున్న అనుబంధాన్ని ఓ వీడియో రూపంలో పంచుకున్నాడు. దాన్ని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ” ఒక కథ.. ఒక జట్టు.. నువ్వు నవ్వినప్పుడు నేను నవ్వుతాను. నువ్వు ఏడ్చినప్పుడు ఏడుస్తాను. నువ్వు గెలిచినప్పుడు నేను కూడా గెలుస్తాను. నువ్వు ఓడిపోతే.. నేను కూడా ఓడిపోయాను.. నువ్వు కలదు కన్నప్పుడు.. నేను కూడా కలలు కన్నాను.. నువ్వు సాధించినప్పుడు.. నేను సాధిస్తాను. నేను నిన్ను నమ్మి నీతోనే ఉంటాను..నేను, మీరు( కోల్ కతా) వేరు కాదు. నన్ను మీలో ఒకడిగా గుర్తించండి. నన్ను మీలో ఉండిపోనివ్వండి. మీరు చెప్పేది నేను వింటాను. మీ మధ్య, నా మధ్య అనితర సాధ్యమైన భావోద్వేగం ఉంది. మనమందరం ఒక బృందం” అని గౌతమ్ గంభీర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. “ఇప్పుడు మనం కొన్ని వారసత్వాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. మనం పెద్ద, ఘనమైన స్క్రిప్ట్ లను రాయాల్సిన అవసరం ఉంది. స్క్రిప్టును ఊదా రంగుతో కాకుండా నీలం రంగుతో రాయాల్సి ఉంది. అద్భుతమైన టీమిండియాను నీలం రంగుతో రాయాల్సి ఉంది. ఇప్పుడు నా ప్రయాణం మరో టర్న్ తీసుకుంది. అది కేవలం త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడేందుకు మాత్రమే అడుగులు వేస్తుందని” గౌతమ్ గంభీర్ ట్విట్టర్ లో రాస్కొచ్చాడు.
కోల్ కతా రాత మార్చాడు
మెంటార్ గా గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టు రాతను పూర్తిగా మార్చేశాడు. 2014 తర్వాత కోల్ కతా అత్యంత నిరాశ జనకమైన ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే ఆ జట్టు ఆటగాళ్లలో సానుకూల దృక్పథాన్ని పెంచి.. విజయం వైపు అడుగులు వేసేలా గౌతమ్ గంభీర్ తర్ఫీదు ఇచ్చాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సాల్ట్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లను అద్భుతంగా తీర్చిదిద్ది.. కోల్ కతా ను విజేతగా నిలిపాడు గౌతమ్ గంభీర్. కోల్ కతా జట్టును కీర్తిస్తూ గౌతమ్ గంభీర్ వీడియో పోస్ట్ చేయడం పట్ల నెట్టింట రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఏరి కోరి కోచ్ గా నియమిస్తే గౌతమ్ గంభీర్ బీసీసీఐ ని మోసం చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఒరిజినాలిటీని ప్రదర్శిస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Team india head coach gautam gambhir cheating the bcci even though he is the coach of team india but his whole concentration on kkr team
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com