Team India Coach: ప్రపంచ టీ20 కప్ తర్వాత భారత జట్టు రూపు రేఖలే మారబోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ(Virat kohli) టీ20 కెప్టెన్సీ నుంచి ఈ మెగా టోర్నీ తర్వాత వైదొలగనున్నాడు. అనంతరం ప్రస్తుతం టీమిండియా కోచ్ గా ఉన్న రవిశాస్త్రి కూడా వైదొలగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఇక మళ్లీ పగ్గాలు చేపట్టనని తెలిపారు. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ రేసు ఆసక్తికరంగా మారింది.
నిన్నా మొన్నటివరకు టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) పేరు బలంగా వినిపించింది. ఎందుకంటే ఆయన సారథ్యంలో అండర్ 19 టీమిండియా బాగా రాటుదేలింది. ఇండియా ఏ జట్టును ఆయన పటిష్టంగా మలిచారు. పైగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి బాగా సన్నిహితుడు ద్రావిడ్. సో ఈ నియామకం పక్కా అని అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు ట్విస్ట్ నెలకొంది.
టీమిండియా కోచ్ గా తాజాగా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే(Anil kumble)ను తీసుకువచ్చేందుకు బీసీసీఐ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇక సడెన్ గా టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్, హైదరాబాదీ అయినా వీవీఎస్ లక్ష్మణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
తాజాగా బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడారు. గతంలో టీమిండియా కోచ్ గా కెప్టెన్ కోహ్లీ సూచనల మేరకు అనిల్ కుంబ్లేను తీసేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడలా కాదు.. సో ప్రస్తుతం కోచ్ పదవికి కుంబ్లేతోపాటు లక్ష్మణ్ కూడా అందుబాటులో ఉన్నారు. వారిద్దరి నిర్ణయం ప్రకారం కోచ్ బాధ్యతలు చేపడుతారు’ అని తెలిపారు. దీంతో మరోసారి టీమిండియా కోచ్ పదవి రేసులో అనిల్ కుంబ్లే వచ్చాడు.
2016-17 మధ్యకాలంలో టీమిండియా కోచ్ గా అనిల్ కుంబ్లే పనిచేశాడు. అయితే కెప్టెన్ కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్ పదవి నుంచి తీసేయాల్సి వచ్చింది. అనంతరం రవిశాస్త్రి పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే ద్రావిడ్ అవుతాడని అందరూ భావిస్తున్న వేళ అతడు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే కుంబ్లే, లక్ష్మణ్ ల పేర్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఎవరు టీమిండియా కోచ్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది.