Team India: రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత.. విరాట్ కోహ్లీ కూడా అదే దారి అనుసరించిన తర్వాత.. టీమిండియా కు కాబోయే టెస్ట్ సారథి ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. చివరికి ఎవరిని సారధిగా నియమించాలో టీమిండియా మేనేజ్మెంట్ లో ఒక రకమైన సందిగ్ధం నెలకొంది. ఇదే క్రమంలో కెప్టెన్ ఎవరు అవుతారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. బుమ్రా నే రాబోయే సారధి అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రోహిత్ శర్మ గైర్హాజరయినప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్లో బుమ్రా నాయకత్వం వహించాడు. చివరికి సిడ్నీ టెస్ట్ కూడా అతడే నాయకత్వం వహించినప్పటికీ.. తీవ్రమైన వెన్ను నొప్పి వల్ల అతడు మధ్యలోనే మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. విపరీతమైన వర్కులోడు.. వేధిస్తున్న గాయాలు.. వంటి కారణాలతో బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కేవలం బౌలర్ గా మాత్రమే కొనసాగుతానని అతడు బీసీసీఐ పెద్దలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
వారిద్దరే కాబోయే రథసారథులు
బుమ్రా తప్పుకున్న నేపథ్యంలో టీమిండియాకు కాబోయే కెప్టెన్ గిల్ అని ప్రచారం జరుగుతోంది.. దీనిని నిజం చేసే విధంగా బీసీసీఐ పెద్దలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం గిల్ వన్డే, టెస్ట్ ఫార్మాట్లో ఉపసారథిగా కొనసాగుతున్నాడు.. సుదీర్ఘమైన ఫార్మాట్లో సత్తా చూపించగల సామర్థ్యం ఉన్నవాడు. అందువల్ల అతడి వైపు బీసీసీఐ పెద్దలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.. ఇక ఐపీఎల్ లోను గుజరాత్ జట్టును గిల్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇక అదే జోరు టెస్ట్ ఫార్మాట్లో కొనసాగిస్తాడని బిసిసిఐ పెద్దలు విశ్వసిస్తున్నారు. గిల్ ను కెప్టెన్ చేసిన తర్వాత.. రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. రిషబ్ పంత్ టెస్టులలో సరైన సామర్థ్యాన్ని ప్రదర్శించగలడని బీసీసీఐ పెద్దలు నమ్ముతున్నారు. వాస్తవానికి పంత్ కంటే కేఎల్ రాహుల్ వైపు బీసీసీఐ పెద్దలు మొగ్గు చూపించినప్పటికీ.. అతడు బ్యాటింగ్ మీద దృష్టి సారించాల్సి ఉందని చెప్పడంతో.. పంత్ ను వైస్ కెప్టెన్ జాబితాలోకి తీసుకున్నారు. మొత్తంగా చూస్తే టెస్ట్ జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించేందుకు బీసీసీఐ పెద్దలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇక ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ నుంచి రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శాశ్వతంగా బయటికి వెళ్లిపోయారు. సీనియర్ ఆటగాళ్లుగా బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే కొనసాగుతున్నారు. మిగతా వాళ్లు మొత్తం యంగ్ ప్లేయర్లే ఉండడం విశేషం. అయితే సీనియర్ ఆటగాళ్లు గనక తప్పుకుంటే.. మరింత మంది యువ ఆటగాళ్లకు అవకాశాలు వస్తాయని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.