Ind Vs Aus 4th Test: టీమిండియాలో సచిన్ గంగులి తర్వాత, లక్ష్మణ్ ద్రావిడ్ తర్వాత, ధోని సురేష్ రైనా తర్వాత.. ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిద్దరూ ఎన్నో మ్యాచ్లలో బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు ఉన్నాయి. టీం ఇండియాను ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు ఉన్నాయి. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసి విజయాన్ని దక్కించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి ఆటగాళ్లు నేడు తేలిపోతున్నారు. అనామకమైన బౌలర్ల చేతిలో అవుట్ అవుతున్నారు. వాళ్లు అవుట్ అవ్వడమే కాదు.. టీమిండియా పరువును కూడా పోగొడుతున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ సాధించిన రికార్డుల ప్రకారం చూసుకుంటే.. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా విధించిన 340 పరుగుల లక్ష్యం అసలు లక్ష్యమే కాదు. వారు కనుక నిలబడితే.. ధైర్యంగా ఆడగలిగితే.. మునుపటి ఫామ్ కనుక ప్రదర్శించగలిగితే టీ మీడియా ఖచ్చితంగా గెలిచేది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేది. కానీ ఆ స్థాయిలో వారు ఆట తీరు ప్రదర్శించకపోవడం వల్ల టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది.
దారుణంగా విఫలం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లలో అతడు ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. అతడి సగటు కేవలం 6.20 మాత్రమే. ఇప్పటివరకు అతడు 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడు తన బెస్ట్ స్కోర్ 10 పరుగుల వద్ద నమోదు చేశాడంటే… బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్లలో, 7 ఇన్నింగ్స్ లలో 27.83 సగటుతో 167 పరుగులు చేశాడు. అయితే ఇందులో అతడికి ఒక శతకం ఉంది. పెర్త్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత తన స్థాయి ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. మెల్ బోర్న్ లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కానీ ఈసారి అతడు ఆ స్థాయిలో ఆడలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో అత్యంత దారుణంగా స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ తమ స్థాయిలో ఆడ లేకపోవడం వల్లే.. సోషల్ మీడియాలో నెటిజన్లు #HappyRetirement అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక మీరు జట్టు నుంచి వెళ్లిపోవడమే మంచిదని మొహమాటం లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు అభిమానులైతే.. మీరు ఇలా జట్టును పాతుకుపోయి ఉండడం వల్లే మిగతా వాళ్లకు అవకాశాలు రావడంలేదని.. త్వరగా జట్టు నుంచి వెళ్లిపోండని పేర్కొంటున్నారు.