Hardik Pandya : భారత దేశంలో అతిపెద్ద ధనవంతుడు ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ శుక్రవారం రాత్రి ముంబై నగరంలో జరిగిన పెళ్లి వేడుక ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. అనేక వేడుకలు జరుపుకున్న తర్వాత.. జూలై 12 శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్నారు. దేశ విదేశాల నుంచి హాజరైన అతిరథ మహారధుల సమక్షంలో అనంత్ అంబానీ రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఈ వేడుకను అంబానీ కుటుంబం అంగరంగ వైభవంగా నిర్వహించడంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సందడిగా మారింది.
అనంత్ – రాధిక వివాహ వేడుకకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్, బుమ్ బుమ్ బుమ్రా, కేఎల్ రాహుల్, అజింక్య రహనే, యజువేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు హాజరయ్యారు. తమదైన శైలిలో నృత్యాలు చేస్తూ వివాహ వేదికను సందడిగా మార్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, టీమిండియా నూతన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే వీరందరిలో హార్దిక్ పాండ్యా బాలీవుడ్ నటి అనన్య పాండే తో కలిసి డ్యాన్స్ చేశాడు.. వారిద్దరూ వేసిన స్టెప్పులు ఆహూతులను అలరించాయి. గులాబీ రంగు షేర్వానీ ధరించిన హార్దిక్, పసుపు రంగులో లెహంగా ధరించిన అనన్య.. డప్పు చప్పులకు అనుగుణంగా పాదాలు కదిపారు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
హార్దిక్ పాండ్యా 2024 అమెరికా – వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 17 సంవత్సరాల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో మైదానంలోనే హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా చివరి ఓవర్ లో రెండు వికెట్లు తీసి, 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3/20 తో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు.
ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం అతడు ఐసీసీ ఆల్ రౌండర్ కేటగిరిలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో బంతితో మాత్రమే కాకుండా బ్యాట్ తో హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన పరుగులు చేశాడు. 150 ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 144 పరుగులు చేశాడు. అంతేకాదు ఏకంగా 11 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో దారుణంగా విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా.. టి20 వరల్డ్ కప్ లో మాత్రం సత్తా చాటాడు.. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాను గట్టిగా హత్తుకున్నాడు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు.
VIDEO | Cricketer Hardik Pandya (@hardikpandya7) and actress Ananya Panday (@ananyapandayy) groove to music at the wedding of Anant Ambani and Radhika Merchant in Mumbai. #AnantRadhikaWedding pic.twitter.com/zxYWuQcjxm
— Press Trust of India (@PTI_News) July 12, 2024