T20 World Cup: క్రికెట్ అభిమానులకు పండగే పండగ.. మొన్నటి వరకు ఐపీఎల్ ధనాధన్ మ్యాచ్ లను ఎంజాయ్ చేసిన అభిమానులు.. దసరా రోజు మంచి కిక్కిచ్చే మ్యాచ్ తో ఐపీఎల్ 14కి ముగింపు పలికారు. ఒక్కరోజు గడిచిందో లేదో.. మరో పొట్టి క్రికెట్ పండగక్కి వేదికలు రెడీ అయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ జట్ల చరిత్రలు.. పసికూనల ప్రతాపాలకు యూఏఇ, ఓమన్ వేదికగా మారబోతున్నాయి. మామూలుగా ప్రతీ రెండున్నరేళ్లకోసారి టీ20 ప్రపంచకప్ ను నిర్వహించాల్సి ఉంటుంది. రెండేళ్లుగా కరోనా ప్రభావం కారణంగా వాయిదా వేశారు. 2016 తరువాత మళ్లీ 2021 చివర్లో టీట్వంటీ సంబరాలు కొద్దిసేపట్లో షురూ కాబోతున్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఓమన్.. పాపువా న్యూగినియా, రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్.. స్కాట్లండ్ పోటీ పడున్నాయి. ఈనెల 18, 20న భారతజట్టు వార్మాఫ్ మ్యాచ్ లు ఉన్నాయి.

రౌండ్ వన్ మ్యాచ్ లు ఓమన్.. పాపువా న్యూగినియాతో ప్రారంభం కానున్నాయి. సూపర్ 12 మ్యాచ్ లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అవుతాయి. ఇండియా.. పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. రౌండ్ వన్ లో ఓమన్, పపువా న్యూగినియా..బంగ్లాదేశ్, స్కాట్లండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. ఇందులోంచి నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ప్రతీరోజు రెండు మ్యాచ్ లు ఉంటాయి. సూపర్ 12 మ్యాచ్ లు ఈనెల 23 నుంచి ప్రారంభం అవుతాయి. సూపర్ 12లో తొలిమ్యాచ్ గ్రూప్ వన్ లోని ఆస్ర్టేలియా.. సౌతాఫ్రికా మధ్య అక్టోబర్ 23న అబుదాబి వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అదేరోజు సాయంత్రం ఇంగ్లాడ్.. విండీస్ మధ్య పోటీ ఉంటుంది. గ్రూప్ 2 తొలిమ్యచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య సాయంత్రం ప్రారంభం అవుతుంది. టీట్వంటీ ఫైనల్ మ్యాచ్ లు నవంబర్ 14న దుబాయ్ వేదికగా జరుగాయి. ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నీని కరోనా భయంతో యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తొలి చాంపియన్ షిప్ ను 2007లో కైవసం చేసుకున్న భారత జట్టు మరోసారి తన ప్రతిభను ప్రదర్శించనుంది. ఇప్పటికే జట్టులో ఏడుగురు టీట్వంటీ ప్రపంచకప్ ఆడిన క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఓసారి విజేతగా.. మరోసారి రన్నరప్ గా నిలిచిన భారత్ ఈసారి చాంపియన్ గా తిరిగిరావాలని కోరుకుంటోంది. కోచ్ రవిశాస్ర్తీకి ఇదే చివరి వరల్డ్ టోర్నీ కాగా.. ఎలాగైనా టీమిండియాకు కప్పు అందించాలనే నిశ్చయంతో ఉన్నారు. జట్టుకూడా పటిష్టంగా ఉండడంతో పెద్దగా అనుమానం ఉండబోదని క్రీడా నిపుణులు చెబుతున్నారు. అయితే 2016లో టీ ట్వంటీ మ్యాచ్ లకు డీఆర్ఎస్ లేదు.. ప్రస్తుతం డీఆర్ఎస్ ను అమలులోకి తెస్తున్నారు.