T20 World Cup 2024: ఆ ముగ్గురు కాదు.. ఈ ముగ్గురు ఆడితేనే టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్

అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టి20 వరల్డ్ కప్ కోసం రోహిత్ ఆధ్వర్యంలో ఒక బృందం అమెరికా వెళ్లిపోయింది.. జూన్ 5న టీమిండియా తన టి20 వరల్డ్ కప్ వేట ప్రారంభించనుంది. ఆ రోజున ఐర్లాండ్ జట్టుతో టీమిండియా తలపడుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 28, 2024 5:15 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది.. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా పొట్టి క్రికెట్ సమరానికి మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది.. గత కప్ లలో సరైన బౌలింగ్ లేకపోవడంతో టీమిండియా కీలక మ్యాచ్ లలో మట్టి కరిచిందని క్రికెట్ నిపుణులు చెబుతుంటారు.. అయితే ఈసారి టీమిండియా కచ్చితంగా టి20 వరల్డ్ కప్ గెలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ప్రారంభ సీజన్ లో టీమిండియా వరల్డ్ కప్ అందుకుంది. అప్పుడు టీమిండియా కు ధోని సారధిగా ఉన్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా భారత జట్టు మరోసారి t20 వరల్డ్ కప్ విజేత కాలేకపోయింది.. గత సీజన్లలో భారత్ కప్ లు సాధిస్తుందని అందరూ అనుకున్నప్పటికీ.. కీలక మ్యాచ్లలో బౌలింగ్ సరిగ్గా లేకపోవడంతో ఓడిపోయింది. దీంతో కప్ కల నెరవేరకుండానే టీమిండియా ఇంటికి వచ్చింది.. అయితే ఈసారి నిర్వహించే టి20 వరల్డ్ కప్ నెగ్గాలని రోహిత్ సేన భావిస్తోంది. వెస్టిండీస్, అమెరికా మైదానాలు భారత ఉపఖండంతో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటాయి.

అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టి20 వరల్డ్ కప్ కోసం రోహిత్ ఆధ్వర్యంలో ఒక బృందం అమెరికా వెళ్లిపోయింది.. జూన్ 5న టీమిండియా తన టి20 వరల్డ్ కప్ వేట ప్రారంభించనుంది. ఆ రోజున ఐర్లాండ్ జట్టుతో టీమిండియా తలపడుతుంది.. అయితే టీమిండియా ఈసారి వరల్డ్ కప్ నెగ్గాలంటే కచ్చితంగా విభిన్నమైన ఆట తీరు ప్రదర్శించాలి.. అయితే భారత బ్యాటింగ్ అంటే రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మాత్రమే గుర్తుకు వస్తారు. ఎందుకంటే టి20 క్రికెట్లో వారు చూపించిన ప్రభావం అటువంటిది. పూర్తి భిన్నమైన మైదానాలు కలిగిన అమెరికా, వెస్టిండీస్ వేదికలపై ఆ ముగ్గురి కంటే కూడా.. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆడటమే టీమిండియా కు అత్యవసరం.. ఇంతకీ ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరంటే..

జస్ ప్రీత్ బుమ్రా

ఇటువంటి వరల్డ్ కప్ లో భారత పేస్ దళాన్ని బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. ప్రస్తుతం ఇతడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.. ఎలాంటి ఆటగాడినైనా బోల్తా కొట్టించే నైపుణ్యం ఇతడి సొంతం. కొన్ని సంవత్సరాలుగా ఇతడు తన సంచలన బౌలింగ్ తో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు.. వెస్టిండీస్, అమెరికాలోని మైదానాలు ఒకింత భిన్నంగా ఉంటాయి.. విభిన్నమైన రీతులలో బౌలింగ్ వేయగల బుమ్రా కు ఈ మైదానాలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పటివరకు 62 t20 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 74 వికెట్లు పడగొట్టాడు.. ఇతడి ఎకనామీ రేటు 6.55 గా ఉందంటే అతడి బౌలింగ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అక్షర్ పటేల్

తన స్పిన్ మాయాజాలంతో ఎంత పెద్ద బ్యాటర్ నైనా పెవిలియన్ పంపించగలడు. కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ వంటి వారు ఉన్నప్పటికీ.. వారు ఎక్కువగా పరుగులు ఇస్తుంటారనే అపవాదు ఉంది. అక్షర పటేల్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మెలికలు తిప్పే బంతులు వేసి పరుగులు తీయకుండా నియంత్రించగలడు. వికెట్లను పడగొట్టడంలో కూడా తన వంతు పాత్ర పోషించగలడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అక్షర్ వేసే బౌలింగ్ టీమిండియా కు బలంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అక్షర్ పటేల్ 52 t20 మ్యాచ్ లు ఆడాడు. 49 వికెట్లు పడగొట్టాడు.. ఇతడి ఎకానమీ రేట్ 7.26 గా ఉంది.

అర్ష్ దీప్ సింగ్

టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అర్ష్ దీప్ సింగ్ కీలక బౌలర్ గా ఉన్నాడు. అర్ష్ దీప్ సింగ్ కు టి20 లో మెరిగైన రికార్డులున్నాయి.. ఐపీఎల్ లో 14 మ్యాచ్లలో 10.03 ఎకనామీ రేటుతో 19 వికెట్లు పడగొట్టాడు.. అదే ఊపు వెస్టిండీస్, అమెరికా మైదానాలపై కొనసాగిస్తాడని టీమిండియా భావిస్తోంది. ఇక్కడ మైదానాలు స్లోగా ఉంటాయి కాబట్టి, స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే టీమిండియా కు అర్ష్ దీప్ సింగ్ ప్రధాన ఆయుధమవుతాడు.. ఇతడు కనక తన సహజ శైలిలో కట్టర్స్ సంధిస్తే.. బ్యాటర్లకు ఇబ్బంది తప్పదు.. ఇప్పటివరకు అర్ష్ దీప్ సింగ్ 44 t20 మ్యాచ్ లు ఆడాడు. 62 వికెట్లు తీశాడు. ఇతడి బౌలింగ్ ఎకానమీ 8.63 గా ఉంది.