T20 World Cup 2024: ఐపీఎల్ ఉత్సాహంగా సాగుతోంది. కొన్ని జట్లు అంచనాలకు మించి ఆడుతున్నాయి. మరికొన్ని జట్లు దారుణమైన ఆటతీరుతో ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ దాదాపు హాఫ్ సీజన్ పూర్తి చేసుకున్నట్టే. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి టీ – 20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఆ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహాలు మొదలుపెట్టాయి. కొన్ని జట్లు ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి. ఇక టీం ఇండియా విషయానికి వస్తే టి20 వరల్డ్ కప్ లో ఐపీఎల్ లో అదరగొడుతున్న ఆటగాళ్లకే అవకాశాలు దక్కుతాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ రాహుల్ ద్రావిడ్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్ల జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, బుమ్రా, కులదీప్ యాదవ్ కు t20 వరల్డ్ కప్ బృందంలో చోటు దక్కిందని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే, ఈ ఆటగాళ్లు అత్యంత సమర్థులు. కానీ, ఎటొచ్చీ బౌలింగ్ విభాగమే బలహీనంగా కనిపిస్తోంది. ఇందుకు కారణం భారత జట్టు బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కేవలం బుమ్రా మీదనే ఆధారపడటమే. అతడు ఉన్నాడనే ధైర్యంతో ఒకరు లేదా ఇద్దరు పేస్ బౌలర్లను తీసుకెళ్లి టి20 వరల్డ్ కప్ లో ఆడదామని మేనేజ్మెంట్ భావిస్తే, అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని సీనియర్ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.
బుమ్రా గొప్ప బౌలర్ అయినప్పటికీ.. అతడినే నమ్ముకుంటే మాత్రం నట్టేట మునగడం ఖాయమని క్రీడా విశేషకులు చెబుతున్నారు. 2022 లో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ జట్టుపై ఏకంగా పది వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. టి20 వరల్డ్ కప్ కు వెళ్లే భారత జట్టులో బౌలర్ల విషయానికొచ్చేసరికి బుమ్రా తో పాటు అర్ష దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అర్ష దీప్ ప్రస్తుత ఐపీఎల్ లో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. అయినప్పటికీ అతనిపై పూర్తి స్థాయిలో భారం వేసే పరిస్థితి లేదు. మహమ్మద్ సిరాజ్ కూడా అంతే. బెంగళూరు తరఫున ఐపీఎల్ ఆడుతున్న ఈ హైదరాబాదీ బౌలర్.. గొప్ప గణాంకాలు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఫలితంగా బెంగళూరు జట్టు అతడు నీకు కొన్ని మ్యాచ్లకు దూరంగా పెట్టింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన అతడు కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఎకానమీ 9.63 గా ఉంది. ఇక అర్ష దీప్ ఎనిమిది మ్యాచ్లో పది వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 9.40 గా ఉంది. బుమ్రా 8 మ్యాచ్లలో 13 వికెట్లు సాధించాడు. ఎకానమీ మాత్రం 6.38 గా ఉంది. ఒకవేళ అర్ష దీప్, సిరాజ్ వద్దనుకుంటే మహమ్మద్ షమీని తీసుకుంటే.. అతడు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. టోర్నీ నాటికి అతడు ఫిట్ నెస్ సాధిస్తాడనేది అనుమానమే.. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగాన్ని చాలా పటిష్టం చేయాల్సి ఉంది. లేకుంటే 2022 టి20 వరల్డ్ కప్ పరిస్థితులే పునరావృతమవుతాయి.
వాస్తవానికి ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మయాంక్ యాదవ్ అదరగొడుతున్నాడు. అతని తర్వాత రాజస్థాన్ జట్టులో స్పిన్ బౌలర్ గా ఉన్న యజువేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. పర్పుల్ క్యాప్ విభాగంలో చాహల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ వీరిద్దరినీ గనక బౌలింగ్ విభాగంలోకి తీసుకుంటే భారత జట్టుకు తిరుగుండదు. వెస్టిండీస్, అమెరికా మైదానాలు పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తాయి. పైగా మాయాంక్ యాదవ్ 150 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులు విసురుతున్నాడు. అలాంటప్పుడు బ్యాటర్లకు అంత ఈజీగా పరుగులు చేసే అవకాశం లభించదు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా సెలక్టర్లు ఒకసారి ఆ దిశగా ఆలోచిస్తే భారత బౌలింగ్ బలోపేతం కావడం ఖాయం.