T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ రెండు జట్లు సూపర్ 8కు వెళ్లడం పక్కా. ఈ నేపథ్యంలో ఐసీసీ మాస్టర్ ప్లాన్ వేసింది. క్రేజ్‌ను మరింత పెంచింది.
అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ జూన్ 1 నుంచి 29 వరకు జరుగుతుంది. ఇందులో భారత్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, ఐర్లాండ్, అమెరికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, నేపాల్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, నమీబియా, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, దక్షిణాప్రికా, ఉగాండా, కెనడా జట్లు ఈ టోర్నీ ఆడనున్నాయి.
20 జట్లు.. నాలుగు గ్రూపులు..
టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 20 జట్లు ఆడనున్నాయి. ఈ జట్లను ఐసీసీ నాలుగు గ్రూపులుగా విభజించింది. ఒకో గ్రూపులో ఐదు జట్లను ఉంచారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు జూన్ 1 నుంచి 18 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతీ కేటగిరీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు చేరుకుంటాయి. నాలుగు జట్ల నుంచి 8 జట్లు సూపర్ 8కు చేరుకుంటాయి. సూపర్ 8 రౌండ్ రెండు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. జూన్ 26, 27 తేదీల్లో తొలి, రెండో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఒకే గ్రూపులో దాయాది జట్లు..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జూన్ 1న గ్రూప్–ఎలో ఉన్న అమెరికా, కెనడా జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ డల్లాస్‌లో జరుగుతోంది. ఇక భారత జట్టు ఆడే నాలుగు మ్యాచ్ లు అమెరికాలోనే జరుగుతాయి. ఇదిలా ఉండగా, దాయాది జట్లు అయిన భారత్, పాకిస్తాన్ జట్లను ఐసీసీ ఒకే గ్రూపులో ఉంచింది. దీని వెనుక ఐసీసీ మాస్టర్ ప్లాన్ వేసింది. మొత్తం నాలుగు గ్రూప్ ఉండగా, ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. ఈ లెక్కన చూస్తూ ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్ జట్లు సూపర్ 8కు రావడం పక్కా.. ఎందుకంటే, ఈ గ్రూప్‌లో ఉన్న మిగతా జట్లు భారత్, పాక్ జట్లతో పోటీలో సరితూగే అవకాశం లేదు. అందుకే ఐసీసీ రెండు జట్లు సూపర్ 8కు చేరేలా ఒకే గ్రూపులు చేర్చింది. ఈ రెండు జట్లు ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లతో తలపడతాయి.