Shreyas Iyer New T20 Captain India: గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత టీమ్ ఇండియాలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవి జట్టుకు సానుకూల ఫలితాలు ఇస్తే బాగుండేది. కానీ ఎక్కువసార్లు మేనేజ్మెంట్ ఆశించిన దానికంటే భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రయోగాలు చేయడం తగ్గడం లేదు. భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేస్తున్నామని మేనేజ్మెంట్ చేస్తున్నప్పటికీ.. ఇప్పటికాలం పరిస్థితి ఏంటనే ప్రశ్నకు మేనేజ్మెంట్ వద్ద సమాధానం లేదు.
టెస్ట్ , వన్డే జట్లకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలో వన్డేలలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రతిభ చూపించలేకపోయింది. టెస్ట్ ఫార్మేట్ లో కూడా అదే స్థాయిలో ఫలితాలను సాధిస్తోంది. గిల్ ను సారధిగా చేసి ఏం సాధించారనే ప్రశ్నకు అటు గౌతమ్ గంభీర్.. ఇటు టీం ఇండియా మేనేజ్మెంట్ వద్ద స్పష్టమైన సమాధానాలు లేవు . ఇవి ఇలా సాగుతుండగానే ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది.
ఐపీఎల్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఐర్లాండ్ టూర్ వెళ్తుంది. ఆ టూర్ లో పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో టీమ్ ఇండియాకు సూర్య కుమార్ యాదవ్ కాకుండా శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కు వ్యక్తిగత కారణాలవల్ల విశ్రాంతి ఇచ్చారని సమాచారం. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా టి20 ఫార్మాట్లో ఓటమి అనేది లేకుండా సాగిపోయింది. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా అందుకుంది. సూర్య కుమార్ యాదవ్ గత ఏడాది అంతగా ఆడలేకపోయినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం అదరగొడుతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపించాడు. అంతకుముందు సిరీస్లలో కూడా దుమ్మురేపాడు.
అయ్యర్ 2024లో ఐపీఎల్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. 2025లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ జట్టును ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అయ్యర్ టి20 జట్టును మెరుగ్గా నడిపిస్తాడని.. అతడికి ఆ స్థాయి ఉందని మేనేజ్మెంట్ భావించింది. వాస్తవానికి గిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నప్పటికీ.. ఎందుకనో అయ్యర్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐర్లాండ్ లో పర్యటించే భారత జట్టుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని సమాచారం.
