Surya Kumar Yadav: ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఒమన్ జట్టు అంచనాలకు భిన్నంగా ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాళ్లు భారత బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. టాప్ 3 ప్లేయర్లు దుమ్మురేపారు. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఒమన్ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బలమైన భారత జట్టుకు తిరుగులేని సమాధానం ఇచ్చారని.. ఈ దూకుడు మొదటి నుంచి కొనసాగించి ఉంటే మ్యాచ్ ఫలితం మరొక విధంగా ఉండేదంటూ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
A beautiful post-match moment: Suryakumar Yadav with the Oman players. ✨ pic.twitter.com/xmP4VVHoEu
— CricketGully (@thecricketgully) September 19, 2025
ఈ మ్యాచ్లో టీమిండియా సారధి సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు రాలేదు. వచ్చిన అవకాశాలను హార్దిక్ పాండ్యా, శివం దుబే వినియోగించుకోలేకపోయారు. ఎప్పటిలాగే సంజు దుమ్మురేపాడు. గిల్ మరోసారి తన విఫల ప్రదర్శనను బయట పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత్ డబుల్ సెంచరీ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ 188 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఒమన్ బౌలర్లు కీలక దశలో వికెట్లు తీయడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ముఖ్యంగా మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న బౌలర్లు.. భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. గిల్ క్లీన్ బౌల్డ్ అయిన విధానం ఈ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా సారధి సూర్య కుమార్ యాదవ్ ఒమన్ జట్టు ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇటీవల పాకిస్తాన్ జట్టు పై గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఆ జట్టు ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అది కాస్త వివాదంగా మారింది. ఏకంగా ఐసిసి కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఈ మ్యాచ్లో భిన్నంగా వ్యవహరించాడు. ఒమన్ జట్టుపై గెలిచిన తర్వాత ఆ జట్టు ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వారితో సరదాగా మాట్లాడాడు. మైదానంలో ఎలా వ్యవహరించాలి.. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. సూటిగా దూసుకు వచ్చే బంతులను ఎలా ఎదుర్కోవాలి.. సమష్టి తత్వాన్ని ఎలా ప్రదర్శించాలి.. అనే విషయాలపై ఒమన్ ప్లేయర్లతో సూర్య కుమార్ యాదవ్ మాట్లాడాడు. తమ జట్టుతో సూర్య కుమార్ యాదవ్ గడిపిన సందర్భాలను ఒమన్ సారథి జాతీందర్ సింగ్ ప్రత్యేకమైనదిగా భావించాడు. అదే విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.. సూర్య కుమార్ యాదవ్ తమ జట్టు సభ్యులతో విలువైన విషయాలు పంచుకున్నారని.. అవి మాకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని జాతిందర్ సింగ్ పేర్కొన్నాడు. సూర్య కుమార్ యాదవ్ ఒమన్ జట్టు ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్లేయర్లను ఉద్దేశించి నెటిజన్లు ” సూర్య వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. మీరు బర్నాల్ రాసుకోండి” అంటూ సెటైర్లు వేస్తున్నారు.