Sunrisers Hyderabad : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున విధ్వంసకరమైన ఆటతీరుతో సత్తా చాటిన రాహుల్ త్రిపాఠి.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL) లో అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో కొల్హాపూర్ టస్కర్స్ కు అతడు సారధ్యం వహిస్తున్నాడు. రత్నగిరి జెట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 39 బంతులు ఎదుర్కొని ఏకంగా 63 పరుగులు చేశాడు.
నంబర్ -3లో బ్యాటింగ్ కు దిగి.. ప్రారంభం నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు.. ఈ మ్యాచ్ లో రాహుల్ కొట్టిన ఒక సిక్సర్ హై లైట్ గా నిలిచింది. కొల్హాపూర్ టస్కర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్లో ఈ సంఘటన జరిగింది.. ఈ ఓవర్ లో రత్నగిరి పెసర్ ప్రదీప్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని వేశాడు. బంతి గమనాన్ని ముందుగానే అంచనా వేసిన త్రిపాఠి స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. దీంతో అది కాస్త భారీ సిక్సర్ గా నమోదయింది.
ఈ మ్యాచ్ లో రాహుల్ విధ్వంసకరమైన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటికీ.. కొల్హాపూర్ జట్టుకు లాభం లేకుండా పోయింది. రాహుల్ కు ఇతర బ్యాటర్లు సహకరించకపోవడంతో 171 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన కొల్హాపూర్ జట్టు.. చివరికి 169 పరుగుల వద్ద ఆగిపోయింది. రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ టోర్నీలో రాహుల్ సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి ఏకంగా 188 పరుగులు చేశాడు.
ఇక ఐపీఎల్లో రాహుల్ అద్భుతంగా ఆడాడు. క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఫైనల్ లో మాత్రం దారుణంగా అవుట్ అయ్యాడు. ఆరు మ్యాచులు ఆడిన రాహుల్ 143.47 స్ట్రైక్ రేట్ తో 165 రన్స్ చేశాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి కి టీమిండియాలో చోటు దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. అతడు ఇలాంటి దూకుడు కొనసాగిస్తే టీమిండియాలో స్థానం సుస్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.