India vs USA : కోహ్లీని ఇబ్బంది పెడుతున్న రోహిత్.. అమెరికాతో జరిగే మ్యాచ్లో సమూల మార్పులు

ముఖ్యంగా రిజ్వాన్ ఇచ్చిన సులువైన క్యాచ్ జార విడవడంతో దూబే పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Written By: NARESH, Updated On : June 11, 2024 10:23 pm

India vs USA, Virat Kohli, Rohit

Follow us on

India vs USA : స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను వెంట్రుకవాసిలో రోహిత్ సేన చేజార్చుకుంది. కనీసం ఆ బాధను టి20 వరల్డ్ కప్ దక్కించుకునైనా, భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో పర్వాలేదనే స్థాయిలో రాణిస్తోంది. పసి కూన ఐర్లాండ్ పై సునాయాసంగానే విజయం సాధించినప్పటికీ.. దాయాది పాకిస్తాన్ పై తీవ్ర ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. ఆడిన రెండు మ్యాచ్లలో గెలవడంతో గ్రూప్ – ఏ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. తన తదుపరి మ్యాచ్ బుధవారం అమెరికాతో ఆడనుంది.

ప్రస్తుత భారత జట్టు ఫాం ప్రకారం చూసుకుంటే అమెరికాపై గెలవడం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ.. టీమిండియా కూర్పు ఇబ్బంది పెడుతోంది.. ఐపీఎల్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ.. టి20 వరల్డ్ కప్ లో తేలిపోవడం నివ్వెర పరుస్తోంది. విరాట్ కోహ్లీని ఈ టి20 వరల్డ్ కప్ లో మేనేజ్మెంట్ ఓపెనర్ గా దించుతోంది. ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఓపెనర్ గా దిగిన విరాట్ కోహ్లీ.. అంచనాలకు మించి ఆడాడు. అయితే ఈ మెగా టోర్నీలో ఆ స్థాయిలో ఆడ లేకపోతున్నాడు. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు బంతులు ఎదుర్కొని, ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఇక పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

రెండు మ్యాచ్లలో ఓపెనర్ గా విఫలమైనప్పటికీ, విరాట్ కోహ్లీ ఆటతీరును శంకించడానికి లేదు. వాస్తవానికి విరాట్ గనుక పాక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నిలబడి ఉంటే కథ వేరే విధంగా ఉండేది..స్లో పిచ్ ల పై టెక్నిక్ గేమ్ ఆడటంలో విరాట్ సిద్ధహస్తుడు.. అయితే అతడికి ఓపెనర్ రోల్ ఇవ్వడం ద్వారా హిట్టింగ్ చేసే క్రమంలో వెంటనే అవుట్ అవుతున్నాడు. ప్రస్తుతానికి టి20 వరల్డ్ కప్ లీగ్ దశలో ఉంది కాబట్టి.. భారత జట్టుకు సరైన స్థాయిలో ప్రత్యర్థి ఎదురు కాలేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు.. సూపర్ -8, సెమీఫైనల్స్, ఫైనల్స్ లో కచ్చితంగా క్రీజ్ లో విరాట్ ఉండాల్సిందే. ఈ మ్యాచ్ లు మొత్తం వెస్టిండీస్ లోని స్లో మైదానాలపై జరుగుతాయి. అలాంటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. అందువల్లే బుధవారం అమెరికాతో జరిగే మ్యాచ్లో జట్టులో కీలక మార్పులు చేసేందుకు రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కసరత్తు చేస్తున్నారు.

ఓపెనర్ గా విఫలమవుతున్న విరాట్ కోహ్లీని మూడో స్థానంలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ యశస్వి జైస్వాల్ జట్టులోకి ఎంట్రీ ఇస్తాడు. రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ మొదలు పెడతాడు.. అప్పుడు శివం దూబే రిజర్వ్ బెంచ్ కు పరిమితమవుతాడు. ఇక మిగతా స్థానాలలో పెద్ద మార్పులేవీ ఉండవు. శివం దూబే పాక్ తో జరిగిన మ్యాచ్లో విఫలం కావడం, ఫీల్డింగ్లో నిర్లక్ష్యంగా ఉండడంతో అతని స్థానంలో యశస్వి జైస్వాల్ కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.. ముఖ్యంగా రిజ్వాన్ ఇచ్చిన సులువైన క్యాచ్ జార విడవడంతో దూబే పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.