Sunrisers : బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో అరి వీర భయంకరమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమవుతోంది. అసలు ఎందుకు అలా వైఫల్యం చెందుతుందో అటు టీం మేనేజ్మెంట్, ఇటు అభిమానులకు అంతు పట్టడం లేదు. గత సీజన్లో ఫైనల్ వెళ్లి సంచలనం సృష్టించిన హైదరాబాద్ జట్టు..ఈ సీజన్లో ఒక్క సంచలన ప్రదర్శన కూడా చేయలేకపోయింది. సొంత మైదానంలో పంజాబ్ జట్టుపై చేజింగ్ కు దిగి సాధించిన విజయం కాస్త అభిమానులకు ఆనందాన్ని కలిగించినప్పటికీ.. అదే స్థాయిలో మిగతా మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు ప్రతిభ చూపలేకపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ అసలు జట్టులో ఎందుకు ఉన్నాడో అర్థం కావడం లేదు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఇంతవరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు.. ఇక మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడో.. ఎప్పుడు దాటిగా ఆడతాడో అంతుచిక్కడం లేదు. అనికేత్ వర్మ షాట్ సెలక్షన్ అత్యంత దారుణంగా ఉంది. ఇక బౌలింగ్లో షమీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు అతడిని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు. కమిన్స్ ప్రారంభ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఇలాంటి క్రమంలో హైదరాబాద్ జట్టు పూర్తిగా ఆటగాళ్ల విషయంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఢిల్లీ జట్టు ముందు మోకరిల్లే ప్రమాదం లేకపోలేదు.
Also Read : కొత్త విమానమైనా.. సన్ రైజర్స్ రాత మార్చుతుందా..
ఇక ఢిల్లీ జట్టు భీకరంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన ఢిల్లీ.. ఆరు విజయాలతో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ హైదరాబాద్ జట్టుతో సోమవారం జరిగే మ్యాచ్లో కనుక ఢిల్లీ గెలిస్తే టాప్ 4 లోకి వెళుతుంది. ఈ ఓటమి ద్వారా హైదరాబాద్ అఫీషియల్ గా ఐపిఎల్ నుంచి నిష్క్రమిస్తుంది. హైదరాబాద్ ఢిల్లీ తో పాటు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మొత్తంగా ఈ నాలుగు మ్యాచ్లలో భారీ వ్యత్యాసంతో విజయం సాధిస్తేనే హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇక ఢిల్లీ జట్టు కూడా బౌలింగ్లో బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో కూడా దుర్భేద్యంగా ఉంది. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు విశాఖపట్నం వేదికగా హైదరాబాద్ జట్టుతో తలపడింది. ఆ మ్యాచ్లో ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్లో పిచ్ పై హైదరాబాద్ ఆటగాళ్ల వైఫల్యాన్ని దర్జాగా క్యాష్ చేసుకున్న ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ, హైదరాబాద్ పరస్పరం 25 మ్యాచ్లలో తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 13 సార్లు విజయం సాధించింది. ఢిల్లీ 12 సార్లు విజయం సాధించింది. మొత్తంగా చూస్తే రెండు జట్లు సమఉజ్జీల మాదిరిగా కనిపిస్తున్నాయి. సొంతమైదానం కావడంతో హైదరాబాద్ జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక ఈ సీజన్లో పంజాబ్ జట్టుతో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ సూపర్ ఆట తీరు ప్రదర్శించింది. మరోసారి అటువంటి అటువంటి ఆట తీరు ప్రదర్శించి ఆకట్టుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. భారీవ్యత్యాసంతో ఢిల్లీ జట్టుపై గెలిచి ప్లే ఆఫ్ ఆశలను కాస్తలో కాస్త సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.
Also Read : నాలుగు పరాజయాలు వరుసగా.. SRH ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే..