Sunrisers Hyderabad Vs Chennai: సొంత మైదానంలో హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. ఈ సీజన్లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత రాజస్థాన్ జట్టుపై జరిగిన మ్యాచ్లో దుమ్మురేపింది. హైదరాబాద్ మైదానంపై హైదరాబాద్ ఆటగాళ్లు ఎలా ఆడతారో మరోసారి రుజువు చేసింది. కానీ శనివారం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం హైదరాబాద్ స్థాయి ఆట తీరు కొనసాగించలేకపోయింది.
ఎప్పటి మాదిరిగానే అభిషేక్ శర్మ(59) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్(23) హెడ్మాస్టర్ పాత్ర పోషించలేకపోయాడు.. హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. దానిని బలమైన ఇన్నింగ్స్ లాగా మార్చలేకపోయాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించి.. ఆ తర్వాత తేలిపోయింది. కెప్టెన్ కిషన్ (0) గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు.. ఈ క్రమంలో క్లాసెన్(59) బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ప్రారంభ ఓవర్లలో వచ్చిన ఆరంభాన్ని చూస్తే హైదరాబాద్ జట్టు 250 మించి పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో మిగతా ఆటగాళ్లు ఆడలేక పోయారు. అభిషేక్ శర్మ, క్లాసెన్ మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు తరఫున అభిషేక్ శర్మ ఎప్పుడో ఒకసారి బ్యాటింగ్ చేస్తున్నాడు. కిషన్ కూడా అలానే ఆడుతున్నాడు.. కేవలం క్లాసెన్ మాత్రమే స్థిరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ప్రారంభంలో ఆచితూచి.. ఆ తర్వాత బ్యాటింగ్లో వేగం పెంచుతున్నాడు. కానీ ఇదే స్పూర్తి మిగతా ప్లేయర్లలో కొరవడింది.
చెన్నై జట్టు ప్రారంభం నుంచి తడబడింది కాబట్టి.. ఇబ్బంది లేకుండా పోయింది. అలా కాకుండా ప్రారంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసి గనుక ఉండి ఉంటే హైదరాబాద్ జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది. సొంత మైదానంలో వీరవిహారం చేయాల్సిన ప్లేయర్లు తడబాటుకు గురి కావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.. పదేపదే ఇవే లోపాలు తలెత్తుతున్న నేపథ్యంలో.. వీటిని సవరించవలసిన అవసరం హైదరాబాద్ జట్టు మీద ఉంది.. అయితేనేమో రాకెట్ వేగంతో ఆరంభం.. లేకుంటేనేమో ఇసుక మేడ మాదిరిగా పడిపోయే వికెట్లు.. ఇదిగో ఇలానే సాగిపోతోంది ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు ఆట తీరు. వాస్తవానికి ఐపీఎల్ ట్రఫీ గెలవాలంటే మెరుగైన ఆరంభంతో పాటు.. మధ్యలో స్థిరమైన ఇన్నింగ్స్ చాలా అవసరం. ఈ సిద్ధాంతాన్ని అమలు చేస్తోంది కాబట్టి పంజాబ్ జట్టు నెంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ ఈ విధానాన్ని అమలు చేయలేక హైదరాబాద్ జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వస్తోంది.
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హుస్సేన్, ప్రఫుల్ సత్తా చూపించారు. చెరి నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టారు. కానీ, చెన్నై తో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యారు. హుస్సేన్ నాలుగు ఓవర్లు వేసి, 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ప్రఫుల్ నాలుగు ఓవర్లు వేసి.. ఏగంగా 60 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు.. వాస్తవానికి వీరిద్దరి నుంచి హైదరాబాద్ అభిమానులు ఈ స్థాయి ప్రదర్శన ఆశించలేదు. మిగతా బౌలర్లు ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి, మలింగ పేస్ రాబట్టారు. వికెట్లను పడగొట్టారు. కానీ, వీరిద్దరు మాత్రం ఆరంభశూరత్వం లాగా బౌలింగ్ వేశారు.. అందుకే చెన్నై జట్టు మీద హైదరాబాద్ సాధించింది గెలుపు కాదు.. హైదరాబాద్ ప్లేయర్లు ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇకపై ఎదురయ్యే ప్రతి మ్యాచ్లో కూడా హైదరాబాద్ గెలవాలి. అప్పుడే ప్లే ఆఫ్ దాకా వెళ్తుంది.