
Markham : సౌత్ ఆఫ్రికా టీ-20 సారథిగా మార్క్రమ్ ఎంపికయ్యాడు. ఇప్పటి దాకా సౌత్ ఆఫ్రికా సారథిగా వ్యవహరిస్తున్న బవుమాను టెస్ట్‌లు, వన్డేలకు మాత్రమే పరిమితం చేశారు. ఇక డుమిని ని కోచ్‌గా ఎంపిక చేశారు. ఇక మార్క్రమ్ ఐపీఎల్ టీ-20లో సన్ రైజర్స్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మార్క్రమ్ రాకతో జట్టు మరింత పరిపుష్టం అవుతుందని దక్షిణాఫ్రికా బోర్డు భావిస్తోంది. కొంత కాలంగా నిలకడలేని ఆటతీరుతో దక్షిణాఫ్రికా ఇబ్బందిపడుతోంది. టెస్ట్‌లు, వన్డేల్లో దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఈక్రమంలో జట్టును మళ్లీ గాడిలో పెట్టాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా యువకుడైన మార్క్రమ్‌ను టీ-20 కెప్టెన్ చేసింది. అంతేకాదు బవూమా తనను తాను నిరూపించుకోని పక్షంలో టెస్ట్‌లు, వన్డేలకు కూడా మార్క్రమ్‌ను కెప్టెన్‌గా చేసే అవకాశాలు లేకపోలేదని సౌత్ ఆఫ్రికా క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్క్రమ్‌ను టీ-20 కెప్టెన్‌గా ఎంపిక చేయడం పట్ల దక్షిణాఫ్రికా ఎత్తుగడ ఉంది. ఒకవేళ అతడు ఆ పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో నిరూపించుకుంటే మిగతా ఫార్మాట్లలోనూ అతడినే కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ-20 ర్యాంకింగ్స్‌లో 256 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో 2,275 ఆరో స్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో 102 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గత కొంత కాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతుండటంతో సౌత్ ఆఫ్రికా ర్యాంకు అంతకంతకూ పడిపోతోంది.
మార్క్రమ్ ఆట తీరు దూకుడుగా ఉంటుంది. ఆ ఆట తీరు నచ్చే కావ్య మారన్ సన్ రైజర్స్ టీం కు కెప్టెన్‌ను చేసింది. కుడి చేతి వాటం బ్యాటింగ్ చేసే మార్క్రమ్ ఐసీసీ టీ-20 బ్యాటర్ల ర్యాకింగ్‌లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ 31 టీ-ట్వంటీ మ్యాచ్‌లు ఆడిన మార్క్రమ్ 147.3 స్ట్రైక్ రేట్‌తో 879 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 47 మ్యాచ్‌ల్లో 1,189 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక టెస్టుల్లో 34 మ్యాచ్‌లు ఆడి 2,171 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలున్నాయి.