Sri Lanka Vs Pakistan Asia Cup 2025: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో శ్రీలంక ఓడిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దారుణమైన ఆట తీరు కొనసాగించింది. బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి పెద్దగా గుణపాఠం నేర్చుకోనట్లు కనిపించింది. ముఖ్యంగా కొంతమంది బ్యాటర్లు దారుణంగా ఆడారు. కామిందు మెండిస్ హాఫ్ సెంచరీ కనుక చేయకపోయి ఉంటే శ్రీలంక పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. పాకిస్తాన్ బౌలర్లు దుమ్మురేపడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగుల వద్ద ముగిసింది.
134 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ప్రారంభంలో దూకుడుగా ఆడింది. ఫర్హాన్, జమాన్ తొలి వికెట్ కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత పాకిస్తాన్ తీవ్రంగా తడబడింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాచ్ మీద పట్టు బిగించాల్సిన శ్రీలంక తేలిపోయింది. హుస్సేన్, నవాజ్ దూకుడుగా ఆడటంతో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. పాకిస్తాన్ చేతిలో ఓటమి ద్వారా శ్రీలంక దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. సూపర్ 4 లో భాగంగా భారత్ పై శ్రీలంక తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫాం ప్రకారం చూసుకుంటే భారత జట్టు ను శ్రీలంక ఓడించడం అంత సులువు కాదు.
రెండు మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ శ్రీలంకకు ఫైనల్ వెళ్లే అవకాశాలుంటాయి. ఇది జరగాలంటే భారత్ బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో భారీ అంతరంతో ఓడిపోవలసి ఉంటుంది. అంతేకాదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్టును ఓడించాలి. అంతేకాదు 26న జరిగే మ్యాచ్లో శ్రీలంక భారత జట్టును భారీ అంతరంతో ఓడించాలి. ఇంత జరిగినప్పటికీ నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. నెట్ రన్ రేట్ కనుక సరైన స్థాయిలో లేకపోతే శ్రీలంక జట్టు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. గత సీజన్లో ఫైనల్ దాకా వచ్చిన శ్రీలంక.. ఈసారి మాత్రం సూపర్ ఫోర్ దశలోనే ఇంటికి వెళ్లడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.