CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కు షాక్ తగిలింది. ఓ పోలీస్ అధికారి ఏకంగా సీఎం చంద్రబాబుకు పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. తన ప్రతిష్టకు, పరువుకు భంగం కలిగించారంటూ.. లీగల్ నోటీసులు పంపించారు. ఏకంగా రూ.1.45 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో విఆర్ లో ఉన్న సీఐ శంకరయ్య తన న్యాయవాది ద్వారా పంపడం విశేషం. ఓ సామాన్య సీఐ ఏకంగా సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఈ నోటీసులు అందించినట్లు శంకరయ్య తరపు న్యాయవాది చెబుతున్నారు.
* ఆరేళ్ల కిందట ఘటన
2019 మార్చి 15న వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య జరిగింది. తొలుత దీనిని గుండెపోటుగా చిత్రీకరించారు. తరువాత హత్య అని తేల్చారు. అప్పటి ప్రభుత్వం చేయించిన హత్యగా అప్పటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా సైతం దానినే హైలెట్ చేసింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్య కేసు విచారణ బాధ్యతలను సిఐడికి అప్పగించింది. అయితే సిబిఐతో విచారణ చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో చంద్రబాబు ఆ కేసును సిబిఐ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసును సిబిఐ నుంచి తప్పించి సిఐడి కి ఇవ్వాలని జగన్ ప్రయత్నించారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అడ్డుకున్నారు. ఈ కేసులో నిందితులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ న్యాయపోరాటానికి దిగారు.
* సానుభూతి రివర్స్
అయితే 2024 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రధాన పాత్ర పోషించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయ్యింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి సానుభూతి లభిస్తే.. 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. చంద్రబాబు సైతం తనపై వివేక హత్య విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని.. బాబాయిని గొడ్డలి వేటుతో చంపించింది జగనేనని సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో రక్తపు మరకలను చెరిపేసారని.. గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని.. అప్పటి ఆధారాలను కూడా తారుమారు చేశారని పదేపదే ఆరోపణలు చేశారు చంద్రబాబు. అప్పట్లో పులివెందుల సిఐ గా శంకరయ్య పని చేసేవారు. ఆయనే అప్పటి రక్తపు మరకలు చెరిపారన్నది ప్రధాన ఆరోపణ. అయితే చంద్రబాబు పదేపదే ఈ ఆరోపణలు చేయడంతో తన పరువుకు భంగం వాటిల్లుతోందని సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపించడం విశేషం. దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.