Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ తీవ్ర నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు, రాజీనామాలు, ప్రజల మధ్యకు వెళ్లడం, పార్టీ బలోపేతం వంటి అంశాలను చర్చించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలు సైతం హాజరుకానున్నారు. ఈనెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యారు జగన్. అటు నుంచి అటే బెంగళూరు వెళ్ళిపోయారు. ఈరోజు తాడేపల్లి కి రానున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతపై దృష్టి..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై యూరియా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల( medical colleges) ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం, ఫీజు రియంబర్స్మెంట్ అంశాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో పోరాటం చేయలేదన్న విమర్శ ఉంది. ఈ తరుణంలో ఈరోజు జరిగే సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆందోళన కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదు. అది ఆ పార్టీకి మైనస్. అందుకే ఇకనుంచి ప్రభుత్వంపై ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా.. హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానిపైనే ఈరోజు ప్రధానంగా తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు జగన్.
* జిల్లాల పర్యటన పై క్లారిటీ..
త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధం కానున్నారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఎప్పటికప్పుడు ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సమావేశంలో దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఏడాది సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని ప్రచారం నడిచింది. అప్పటినుంచి జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే ఈసారి తప్పకుండా జిల్లాల పర్యటనకు సంబంధించి జగన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఉంటుందని ఒక ప్రచారం ఉంది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి.. వారితో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తారని కూడా తెలుస్తోంది. పార్టీ ఆందోళన కార్యక్రమాలను పెంచడం ద్వారా ప్రజల మధ్యకు బలంగా వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. చాలా అంశాలపై ఈరోజు జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.