SRH Vs RR: రాజస్థాన్ రాయల్ జట్టుకు పై వాక్యాలు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో గుర్తుకు వచ్చుంటాయి..హెడ్(67) పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు పండగ చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు స్కోర్ నెమ్మదిస్తుందని భావించారు. అలా జరగలేదు. అలా జరిగే అవకాశం లేదని ఇషాన్ కిషన్ నిరూపించాడు. ప్రతిబంతిని దంచి కొట్టాడు. ప్రతి బౌలర్ పై ఎదురుదాడికి దిగాడు.. ఏ మాత్రం భయపడకుండా.. ఎడమ చేతివాటంతో తుక్కు రేగ్గోట్టేలా బ్యాటింగ్ చేశాడు. ఈ కథనం రాసే సమయానికి 31 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 70* పరుగులు చేశాడు. జోప్రా ఆర్చర్ కైతే నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. హెడ్ విధ్వంసం సృష్టిస్తే.. ఇషాన్ కిషన్ ప్రళయాన్ని కళ్ళ ముందు ఉంచాడు.. హెడ్ తో రెండో వికెట్ కు 85, నితీష్ కుమార్ రెడ్డితో 71* పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసే దిశగా బాటలు పరిచాడు. ఇప్పటికైతే హైదరాబాద్ జట్టు 14.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
ముంబై జట్టు వద్దనుకుంది
గత ఏడాది జరిగిన మెగా వేలంలో ఇషాన్ కిషన్ ను ముంబై జట్టు యాజమాన్యం వద్దనుకుంది. మెగా వేలంలో అతడిని రిటైన్ చేసుకోలేదు. కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా ఆ జట్టుకు రాలేదు. మెగా వేలంలో హైదరాబాద్ జట్టు యాజమాన్యం 15.25 కోట్లకు ఇషాన్ కిషన్ ను కొనుగోలు చేసింది. ఆ నిర్ణయం ఎంత గొప్పదో.. కావ్య తీసుకున్న స్టెప్ ఎంత బలమైనదో ఆదివారం నాటి అతడి ఇన్నింగ్స్ నిరూపించింది. హైదరాబాద్ జట్టు స్కోరు 45/1 వద్ద ఉన్నప్పుడు కిషన్ క్రీజ్ లోకి వచ్చాడు.. హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లతో విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. హైదరాబాద్ జట్టు స్కోరు 200 మార్కును చేరుకుందంటే దానికి ప్రధాన కారణం ఇషాన్ కిషన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గత ఏడాది జరిగిన మెగా వేలంలో కిషన్ ను ముంబై జట్టు రిటైన్ చేసుకోకపోవడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ తీసుకొన్న నిర్ణయం పట్ల సానుకూలతలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఇషాన్ కిషన్ ఏకంగా 70 పరుగులు చేసి.. సెంచరీ వైపు వెళ్తున్న సమయంలో అతడి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కావ్య మారన్ తీసుకున్న నిర్ణయం పట్ల హైదరాబాద్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమౌతోంది.
ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డులు
ఇషాన్ కిషన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అనేక రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు ఈశాన్ 105 మ్యాచ్లు ఆడాడు. 2695 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 137. ఇప్పటివరకు కిషన్ 17 హాఫ్ సెంచరీలు చేశాడు.