SRH Vs RCB 2024: కోహ్లీ.. నిన్ను ఇలా చూడలేకపోతున్నాం..

సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. హైదరాబాద్ బ్యాటర్లకు దాసోహం అయిపోయారు. 287 పరుగులు సమర్పించుకొని అత్యంత చెత్త బౌలింగ్ వేసిన రికార్డు తమ పేరు మీద లిఖించుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 16, 2024 3:27 pm

SRH Vs RCB 2024

Follow us on

SRH Vs RCB 2024: ఐపీఎల్ లో బెంగళూరు జట్టు ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ ఆటగాళ్లు సరిగ్గా ఆడక పోవడంతో వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇదే ఆట కొనసాగిస్తే ఆ జట్టు లీగ్ దశ నుంచే ఇంటికి వెళ్లడం ఖాయం. ఐపీఎల్ ప్రారంభమై 16 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంతవరకు బెంగళూరు ఒక్క కప్ కూడా దక్కించుకోలేదు. ఈసారి కప్ పై ఎన్నో ఆశలతో మైదానంలోకి అడుగుపెడితే.. అడుగడుగునా ఓటములే ఎదురవుతున్నాయి.

ఇక సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. హైదరాబాద్ బ్యాటర్లకు దాసోహం అయిపోయారు. 287 పరుగులు సమర్పించుకొని అత్యంత చెత్త బౌలింగ్ వేసిన రికార్డు తమ పేరు మీద లిఖించుకున్నారు. బెంగళూరు బౌలర్ ల బౌలింగ్ లో పస లేకపోవడంతో హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. హెడ్ సెంచరీ సాధించాడు. క్లాసెన్ తన మార్క్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక మిగతా ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశారు. ఫలితంగా హైదరాబాద్ 287 పరుగుల స్కోర్ సాధించింది.

చేజింగ్ లో బెంగళూరు బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. దినేష్ కార్తీక్, డూ ప్లెసిస్, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడినప్పటికీ గెలుపు వాకిట 25 పరుగుల దూరంలో బెంగళూరు జట్టు నిలిచిపోయింది. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కొనసాగించారు. ముఖ్యంగా బౌలర్లు దారుణంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి గురయ్యాడు. బౌలర్లు లయ తప్పి బౌలింగ్ వేస్తుండడంతో అతడు కోపంగా అరిచాడు. మైదానంలో దీర్ఘంగా ఆలోచించాడు. ఓపెనర్ గా మైదానంలోకి దిగి బ్యాటింగ్ భారాన్ని మొత్తం ఒక్కడే మోస్తున్నాడు. మిగతా ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోవడంతో అది జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో బెంగళూరు వరస వైఫల్యాలు ఎదుర్కొంటుంది. జట్టు ఓడిపోయినప్పుడు కోహ్లీ నిరాశతో కనిపిస్తున్నాడు. ఆవేదనలో కూరుకు పోతున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సోమవారం ధారాళంగా పరుగులు చేసినప్పుడు కోహ్లీ పలుమార్లు మైదానంలో గట్టిగా అరిచాడు. పట్టరాని కోపంతో ఊగిపోయాడు. కనీసం తోటి ఆటగాళ్లతో కూడా మాట్లాడలేకపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని చూసిన అభిమానులు.. “కోహ్లీని అలా చూడలేకపోతున్నామని” కామెంట్స్ చేస్తున్నారు.