SRH VS MI : ప్రస్తుత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లలో కొందరు యాజమాన్యం నుంచి అ గౌరవాన్ని పొందడం లేదు. యాజమాన్యానికి భరోసా ఇవ్వడం లేదు. ఏదో అవకాశం వచ్చింది.. మైదానంలోకి వస్తున్నాం.. వెంటనే వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఆట సాగుతోంది.. ఫలితంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న యాజమాన్యం.. ప్రేక్షక దళం నిరుత్సాహానికి గురవుతున్నారు. వారి ఆట తీరు చూసి ఇదీ ఆట. ఇదేనా ఆట అంటూ ప్రశ్నిస్తున్నారు.. వేగానికి కొలమానంగా.. దూకుడుకు పర్యాయపదంగా ఆడాల్సిన ఆటగాళ్లు.. టెస్ట్ మ్యాచ్ తరహాలో.. గల్లి క్రికెట్ స్థాయిలో బ్యాటింగ్ చేస్తే.. చూసే ప్రేక్షకులకు ఎలా ఉంటుంది.. కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన యాజమాన్యానికి ఇంకెలా ఉంటుంది.. బహుశా అందువల్లే గురువారం ముంబై జట్టుతో హైదరాబాద్ ఆడుతున్న మ్యాచ్ ను చూసిన మెజారిటీ ప్రేక్షకులు పై అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.
Also Read: కాటేరమ్మ కొడుకుల్లో ఉత్సాహం తగ్గిందా? ఏంటీ నీరసం?
ఎందుకు ఇస్తున్నట్టు?
ఐపీఎల్ ప్రారంభంలో రాజస్థాన్ జట్టుపై హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. దీంతో వన్ డౌన్ విభాగంలో గట్టి బ్యాటర్ దొరికాడని హైదరాబాద్ జట్టు భావించింది. కానీ ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఫ్లాప్ షో కొనసాగుతూనే వస్తోంది. మరీ దారుణంగా ముంబై జట్టుపై రెండు పరుగులు మాత్రమే చేసి ఇషాన్ కిషన్ అవుట్ కావడం అతడి నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.. వాస్తవానికి ముంబై జట్టుతో ఇషాన్ కిషన్ కు ఎంతో అనుబంధం ఉంది. గత సీజన్లో అతడు ముంబై జట్టుకు ఆడాడు. కానీ ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న అతడు ముంబై జట్టుపై దారుణంగా తేలిపోయాడు. మరో ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి.. తెలుగువాడు, గత సీజన్లో దూకుడుగా బ్యాటింగ్ చేసినవాడు.. బౌలింగ్ కూడా చేయగలిగే నేర్పు ఉన్నవాడు.. దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శించాడు. 21 బంతుల్లో 19 పరుగులు చేసి.. ఏదో వరల్డ్ కప్ సాధించినంత బిల్డప్ ఇచ్చాడు. అంతేకాదు అతడి సుదీర్ఘ ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క ఫోర్ ఉండడం .. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ తీరును తేట తెల్లం చేస్తోంది. మొదట్లో నిదానంగా ఆడినప్పటికీ క్లాసెన్ దూకుడు ప్రదర్శించాడు. చివర్లో వచ్చిన అనికేత్ వర్మ 8 బాల్స్ ఎదుర్కొన్నాడు. ఏకబిగిన 2 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 18 పరుగులు చేశాడు. కానీ ఇదే దూకుడు నితీష్ కుమార్ రెడ్డి చూపించలేకపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి చెత్త బ్యాటింగ్ చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఇప్పటికైనా నితీష్, ఇషాన్ ను పక్కనపెట్టి అనికేత్ వర్మకు వన్ డౌన్ లో అవకాశం ఇవ్వాలని.. రిజర్వ్ ఆటగాళ్లలో ఉత్తమ బ్యాటర్లకు చోటు కల్పించాలని సూచిస్తున్నారు.