SRH vs HCA
SRH vs HCA : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ విజిలెన్స్ బృందాలు మంగళవారం ఉదయం రంగంలోకి దిగాయి. దీంతో సాయంత్రానికి ఒకసారిగా సన్నివేశం మారిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయి. కాంప్లిమెంటరీ పాసులు నిబంధన ప్రకారం ఇస్తామని.. అదనంగా ఒక్క పాస్ కూడా ఇవ్వబోమని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం స్పష్టం చేసింది. దానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ తల ఊపింది. దీంతో ఇరు వర్గాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.. గతంలో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం మేరకు పనిచేస్తామని సన్ రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు స్పష్టం చేశారు. ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి సహకరిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ” వివాదాలు ముగిశాయి. చర్చలు ఫలప్రదమయ్యాయి. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని” హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవరాజ్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులు కిరణ్ శరవణన్, రోహిత్ పేర్కొన్నారు.
Also Read : సన్ రైజర్స్ కు వేధింపులు.. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ తో మారిన సీన్
ముఖ్యమంత్రి ఆదేశాలతో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ రూరల్ విభాగం విజిలెన్స్ అధికారులు, అదనపు ఎస్పీ పాల్వాయి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్లోని క్రికెట్ మైదానానికి వెళ్లారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాల్లో విచారణ మొదలుపెట్టారు. జరిగిన లావాదేవీలు, కుదిరిన ఒప్పందాలు, ఈ మెయిల్ సంభాషణలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల విషయంలో చేసుకున్న పరిణామాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు.. అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పది కోట్లు ఇస్తామని చెప్పిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.. ఉప్పల్ మైదానానికి రంగులు వేయించడానికి ఖర్చు చేశామని చెబుతోందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. కాంప్లిమెంటరీ పాస్ ల విషయంలో చోటు చేసుకున్న ఆరోపణలపై విజిలెన్స్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.. ఉప్పల్ మైదానంలో జరిగే మ్యాచ్ లకు సంబంధించి సీటింగ్ సామర్థ్యంలో 10% వాటా ప్రకారం 3,900 పాసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఇవ్వడానికి తాము ఒప్పుకున్నప్పటికీ.. మరో 3,900 పాసులు కావాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు కోరారని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపించింది. అయితే ఆ పాసులను తాము డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. మొత్తానికి ఇరువర్గాలు వాద ప్రతివాదాలు చేసుకున్న తర్వాత.. విజిలెన్స్ అధికారుల సూచనతో ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో వివాదం ముగిసిపోయింది.
Also Read : ఓడిపోయినా సరే తగ్గేదేలే.. దంచి కొట్టుడే అంటున్న ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్